ఇంటర్ యూనిట్స్ పెట్రోలియం టెన్నిస్ టోర్నమెంట్‌లో సాకేత్ మైనేని ప్రాతినిధ్యం వహిస్తున్న గెయిల్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది.
ఫైనల్లో ఓఎన్‌జీసీతో గెయిల్ పోరు
బెంగళూరు: ఇంటర్ యూనిట్స్ పెట్రోలియం టెన్నిస్ టోర్నమెంట్‌లో సాకేత్ మైనేని ప్రాతినిధ్యం వహిస్తున్న గెయిల్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ టీమ్ ఈవెంట్‌లో భారత సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్నకు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ షాక్ ఇచ్చాడు. సెమీఫైనల్లో గెయిల్ జట్టు 2-0తో ఐఓసీఎల్ జట్టుపై విజయం సాధించింది.
సింగిల్స్ మ్యాచ్‌లో సాకేత్ (గెయిల్) 7-6 (7/4), 6-4తో రోహన్ బోపన్న (ఐఓసీఎల్)పై చెమటోడ్చి నెగ్గాడు. మరో పోరులో రాంకుమార్ రామనాథన్ (గెయిల్) 6-2, 6-1తో వాసుదేవ్ రెడ్డి (ఐఓసీఎల్)పై అలవోకగా గెలిచాడు. మరో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఓఎన్‌జీసీ 2-0తో ఓఐఎల్ జట్టుపై గెలుపొందింది. హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్ (ఓఎన్‌జీసీ) 6-1, 6-2తో అన్షుమన్ దత్త (ఓఐఎల్)పై గెలుపొందగా, రంజీత్ (ఓఎన్‌జీసీ) 6-1, 6-1తో సీఎస్ మహంతి (ఓఐఎల్)ని ఓడించాడు. బుధవారం జరిగే టైటిల్ పోరులో ఆతిథ్య గెయిల్ జట్టు... ఓఎన్‌జీసీతో తలపడుతుంది.