ఎదురులేని ఫెడరర్‌ 

 Roger Federer into 16th Wimbledon quarter-final - Sakshi

వింబుల్డన్‌లో 16వసారి క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన స్విట్జర్లాండ్‌ దిగ్గజం

మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ ప్లిస్కోవా ఓటమి

క్వార్టర్‌ ఫైనల్లోపే టాప్‌–10 క్రీడాకారిణులు ఔట్‌

లండన్‌: రికార్డుస్థాయిలో తొమ్మిదో వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌పై గురి పెట్టిన స్విట్జర్లాండ్‌ స్టార్‌ రోజర్‌ ఫెడరర్‌ తన జోరు కొనసాగిస్తూ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అడ్రియన్‌ మనారినో (ఫ్రాన్స్‌)తో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫెడరర్‌ 6–0, 7–5, 6–4తో అలవోకగా గెలిచాడు. గంటా 45 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 36 ఏళ్ల ఫెడరర్‌ 12 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేశాడు. 20 అనవసర తప్పిదాలు చేసిన అతను 44 విన్నర్స్‌ కొట్టాడు. వరుసగా 20వసారి వింబుల్డన్‌ టోర్నీలో ఆడుతున్న ఫెడరర్‌ 16వసారి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. ఓవరాల్‌గా అతని కెరీర్‌లో 53వసారి గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో అండర్సన్‌తో ఫెడరర్‌ ఆడతాడు.  

నాదల్‌ కూడా... 
మరోవైపు ప్రపంచ నంబర్‌వన్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) కూడా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నాదల్‌ 6–3, 6–3, 6–4తోజిరీ వెసిలీ (చెక్‌ రిపబ్లిక్‌)పై నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో నిషికోరి (జపాన్‌) 4–6, 7–6 (7/5), 7–6 (12/10), 6–1తో గుల్బిస్‌ (లాత్వియా)పై, జాన్‌ ఇస్నెర్‌ (అమెరికా) 6–4, 7–6 (10/8), 7–6 (7/4)తో సిట్‌సిపాస్‌ (గ్రీస్‌)పై, రావ్‌నిచ్‌ (కెనడా) 6–3, 6–4, 6–7 (5/7), 6–2తో మెక్‌డొనాల్డ్‌ (అమెరికా)పై, కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా) 7–6 (7/4), 7–6 (7/2), 5–7, 7–6 (7/3)తో గేల్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచారు.  

సెరెనా సునాయాసంగా... 
మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా) సునాయాస విజయంతో 13వసారి ఈ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సెరెనా 6–2, 6–2తో రొడీనా (రష్యా)ను ఓడించింది. మరోవైపు ఏడో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 3–6, 6–7 (1/7)తో కికి బెర్‌టెన్స్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓటమి పాలైంది. ప్లిస్కోవా ఓటమితో మహిళల సింగిల్స్‌లో టాప్‌–10 సీడెడ్‌ క్రీడాకారిణిలందరూ క్వార్టర్‌ ఫైనల్లోపే ఇంటిదారి పట్టడం గమనార్హం. ఇతర మ్యాచ్‌ల్లో కెర్బర్‌ (జర్మనీ) 6–3, 7–6 (7/5)తో బెలిండా బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌)పై, ఒస్టాపెంకో (లాత్వియా) 7–6 (7/4), 6–0తో సస్నోవిచ్‌ (బెలారస్‌)పై, జూలియా జార్జెస్‌ (జర్మనీ) 6–3, 6–2తో డోనా వెకిచ్‌ (క్రొయేషియా)పై, కామిలా గియోర్గి (ఇటలీ) 6–3, 6–4తో మకరోవా (రష్యా)పై, సిబుల్కోవా (స్లొవేకియా) 6–4, 6–1తో సె సు–వె (చైనీస్‌ తైపీ)పై, దరియా కసత్‌కినా (రష్యా) 6–7 (6/8), 6–3, 6–2తో అలీసన్‌ వాన్‌ ఉత్వానక్‌ (బెల్జియం)పై గెలిచారు. మంగళవారం జరిగే క్వార్టర్స్‌లో సిబుల్కో వాతో ఒస్టాపెంకో; కసత్‌కినాతో కెర్బర్‌; బెర్‌టెన్స్‌తో జూలియా; కామిలాతో సెరెనా తలపడతారు.

క్వార్టర్‌ ఫైనల్లో శరణ్‌ జంట 
పురుషుల డబుల్స్‌లో దివిజ్‌ శరణ్‌ (భారత్‌) –ఆర్తెమ్‌ సితాక్‌ (న్యూజిలాండ్‌) ద్వయం అద్భుత విజయంతో క్వార్టర్‌ ఫైనల్లోకి చేరింది. మూడో రౌండ్‌లో శరణ్‌–సితాక్‌ జంట 1–6, 6–7 (3/7), 6–4, 6–4, 6–4తో జొనాథన్‌ ఎల్రిచ్‌ (ఇజ్రాయెల్‌)–మట్కోవ్‌స్కీ (పోలాండ్‌) జోడీపై గెలిచింది. 3 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్‌లు కోల్పోయిన శరణ్‌ జంట ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లు గెలిచి విజయం సాధించడం విశేషం.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top