పసిడి పట్టు...

 Rio was a different time, today is another day: Sushil Kumar - Sakshi

 సునాయాసంగా స్వర్ణం నెగ్గిన సుశీల్‌

రాహుల్‌కూ బంగారు పతకం

బబిత ఖాతాలో రజతం, కిరణ్‌కు కాంస్యం

కొంతకాలంగా తనకు సంబంధం లేకుండానే వివాదాల్లో నిలిచిన భారత స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో మాత్రం విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ గేమ్స్‌లో వరుసగా మూడోసారి స్వర్ణ పతకాన్ని గెలిచి ‘హ్యాట్రిక్‌’ సాధించాడు. అంతేకాకుండా ఈ గేమ్స్‌ చరిత్రలో మూడుసార్లు బంగారు పతకం గెలిచిన ఏకైక భారత రెజ్లర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. సుశీల్‌కు తోడు మరో భారత రెజ్లర్‌ రాహుల్‌ అవారే కూడా పసిడి పతకం నెగ్గాడు. మహిళా రెజ్లర్లు బబిత రజతం, కిరణ్‌ కాంస్యం సాధించి భారత సత్తాను చాటారు. షూటింగ్‌లో తేజస్విని రజతం... అథ్లెటిక్స్‌లో సీమా పూనియా రజతం, నవ్‌జీత్‌ కాంస్యం గెలిచారు. దాంతో పోటీల ఎనిమిదో రోజు భారత్‌కు ఏకంగా ఏడు పతకాలు వచ్చాయి.

గోల్డ్‌కోస్ట్‌: వెయిట్‌లిఫ్టర్లు తమ పతకాల వేటను ముగించగా... షూటర్లు దానిని కొనసాగిస్తుండగా... వీరి సరసన రెజ్లర్లు కూడా చేరారు. దీంతో కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ పతకాల పంట పండిస్తోంది. పోటీల ఎనిమిదో రోజు రెజ్లింగ్‌ ఈవెంట్‌ ప్రారంభంకాగా... బరిలోకి దిగిన నలుగురు భారత రెజ్లర్లు సుశీల్, రాహుల్‌ అవారే, బబిత కుమారి, కిరణ్‌ పతకాలు గెల్చుకోవడం విశేషం. భారత మేటి రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు 74 కేజీల విభాగంలో తన ప్రత్యర్థుల నుంచి ఏమాత్రం పోటీ ఎదురుకాలేదు. సుశీల్‌ గెలిచిన నాలుగు బౌట్‌లలో మూడు టెక్నికల్‌ సుపీరియారిటీ (ఇద్దరి మధ్య కనీసం 10 పాయింట్లు తేడా) ద్వారా రాగా... మరొకటి ‘బై ఫాల్‌’ (ప్రత్యర్థి భుజాన్ని మ్యాట్‌కు రెండు సెకన్లకంటే ఎక్కువసేపు అదిమి పెట్టడం) ద్వారా వచ్చింది.  

తొలి రౌండ్‌లో 11–0తో జెవోన్‌ బాల్‌ఫోర్‌ (కెనడా)ను ఓడించిన సుశీల్‌... క్వార్టర్‌ ఫైనల్లో 10–0తో అసద్‌ బట్‌ (పాకిస్తాన్‌)పై గెలిచాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా రెజ్లర్‌ కానర్‌ ఇవాన్స్‌ను ‘బై ఫాల్‌’ పద్ధతిలో చిత్తు చేసిన సుశీల్‌...జోనస్‌ బోథా (దక్షిణాఫ్రికా)తో జరిగిన ఫైనల్లో కేవలం 80 సెకన్లలోనే 10–0తో ఆధిక్యంలోకి వెళ్లి విజయాన్ని, స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. 2010 ఢిల్లీ గేమ్స్‌లో 66 కేజీల విభాగంలో విజేతగా నిలిచిన సుశీల్‌... 2014 గ్లాస్కో గేమ్స్‌లో 74 కేజీల విభాగంలో చాంపియన్‌ అయ్యాడు.  మరోవైపు పురుషుల 57 కేజీల విభాగంలో మహారాష్ట్ర రెజ్లర్‌ రాహుల్‌ అవారే కూడా విజేతగా నిలిచాడు. తొలి రౌండ్‌లో 11–0తో జార్జి రమ్‌ (ఇంగ్లండ్‌)పై... క్వార్టర్‌ ఫైనల్లో 10–0తో థామస్‌ సిచిని (ఆస్ట్రేలియా)పై గెలిచిన రాహుల్‌... సెమీఫైనల్లో 12–8తో మొహమ్మద్‌ బిలాల్‌ (పాకిస్తాన్‌)పై, ఫైనల్లో 15–7తో స్టీవెన్‌ తకహాషి (కెనడా)పై విజయం సాధించి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు.   మహిళల రెజ్లింగ్‌ 53 కేజీల విభాగంలో బబిత కుమారి స్వర్ణ పతక పోరులో 3–5తో డయానా వీకెర్‌ (కెనడా) చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకుంది. ఈ విభాగంలో ఐదు ఎంట్రీలు మాత్రమే రావడంతో రౌండ్‌ రాబిన్‌ లీగ్‌లో బౌట్‌లను నిర్వహించారు. 76 కేజీల విభాగం కాంస్య పతక పోరులో కిరణ్‌ ‘బై ఫాల్‌’ పద్ధతిలో కటుస్కియా పరిధవెన్‌ (మారిషస్‌)ను ఓడించింది.  

అథ్లెటిక్స్‌లో బోణీ... 
మహిళల డిస్కస్‌ త్రోలో సీమా పూనియా, నవ్‌జీత్‌ ధిల్లాన్‌ అద్భుత ప్రదర్శనలతో అథ్లెటిక్స్‌లో భారత్‌ పతకాల బోణీ చేసింది. డిస్క్‌ను సీమా 60.41 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో... నవ్‌జీత్‌ 57.43 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచి వరుసగా రజత, కాంస్య పతకాలను గెల్చుకున్నారు. పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో అర్పిందర్‌ సింగ్, రాకేశ్‌ బాబు ఫైనల్‌కు అర్హత పొందారు.  

తేజస్విని గురికి రజతం... 
షూటింగ్‌లో భారత్‌కు మరో పతకం వచ్చింది. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్‌ తేజస్విని సావంత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఈ మహారాష్ట్ర షూటర్‌ 618.9 పాయింట్లు స్కోరు చేసి రజత పతకం సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో మరో భారత షూటర్‌ అంజుమ్‌ 16వ స్థానంలో నిలిచింది. 

బ్యాడ్మింటన్‌లో అదే జోరు 
భారత బ్యాడ్మింటన్‌ ఆటగాళ్లు అదరగొట్టారు. వ్యక్తిగత విభాగాల్లో బరిలో దిగిన అందరూ క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించారు. ప్రిక్వార్టర్స్‌లో పీవీ సింధు 21–15, 21–9తో హువాన్‌ యు (ఆస్ట్రేలియా)పై; రుత్విక 21–10, 21–23, 21–10తో జియి మిన్‌ యో (సింగపూర్‌)పై; ప్రపంచ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ 21–10, 21–10తో నిలుక కరుణరత్నే (శ్రీలంక)పై; ప్రణయ్‌ 21–18, 21–11తో ఆంథోని జోయ్‌ (ఆస్ట్రేలియా)పై గెలుపొందారు. సైనా నెహ్వాల్‌ 21–4, 2–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ఆమె ప్రత్యర్థి జెసిక లీ (ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌) గాయం కారణంగా తప్పుకోవడంతో క్వార్టర్స్‌కు చేరింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌–అశ్విని పొన్నప్ప, ప్రణవ్‌ చోప్రా–సిక్కి రెడ్డి జంటలు... మహిళల డబుల్స్‌లో అశ్విని–సిక్కిరెడ్డి, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి జంటలు కూడా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాయి.  

హాకీలో కాంస్యం కోసం... 
అందివచ్చిన అవకాశాలను వృథా చేసుకున్న భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా చేతిలో 1–0తో ఓడింది. మ్యాచ్‌ చివరి క్వార్టర్‌లో భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇక ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ కాంస్యం కోసం ఇంగ్లండ్‌తో తలపడనుంది.  

సెమీస్‌లో మనిక 
టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ)లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్‌ విభాగంలో మనిక బాత్రా సెమీఫైనల్‌కు అర్హత సాధించగా... మౌమా దాస్, మధురిక ఓటమి పాలయ్యారు. మనిక క్వార్టర్‌ ఫైనల్‌లో 4–1తో యిహాన్‌ జూ (సింగపూర్‌)పై గెలిచింది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో శరత్‌ 4–1తో హేమింగ్‌ హు (ఆస్ట్రేలియా)పై; హర్మీత్‌ 4–1తో చీ ఫెంగ్‌ లియాంగ్‌ (మలేసియా)పై గెలుపొంది క్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు.  

దీపిక జంట జోరు... 
మహిళల స్క్వాష్‌ డబుల్స్‌లో దీపిక పళ్లికల్‌–జోష్నా చినప్ప జంట సెమీ ఫైనల్‌ చేరింది. ఈ జోడీ క్వార్టర్స్‌లో 11–8, 11–10తో టెస్నీ ఈవాన్స్‌–పీటర్‌ క్రీడ్‌ (వేల్స్‌)పై గెలుపొందింది. సెమీస్‌లో టాప్‌ సీడ్‌ జెయెల్లె కింగ్‌–పాల్‌ కోల్‌ (న్యూజిలాండ్‌) ద్వయంతో తలపడనుంది. పురుషుల డబుల్స్‌లో విక్రమ్‌–రమిత్‌ టాండన్‌ జంట క్వార్టర్స్‌కు చేరింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దీపిక పళ్లికల్‌–సౌరవ్‌ జంట సెమీస్‌కు చేరగా... జోష్నా చినప్ప–హరిందర్‌ పాల్‌ సంధూ జంట క్వార్టర్‌ ఫైనల్‌లోనే నిష్క్రమించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top