
జడేజా అరుదైన మైలురాయి
భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ తో మూడో వన్డేలో జడేజా రెండు వికెట్లను తీసి 150 వికెట్ల మార్కును దాటాడు.
కోల్కతా: భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ తో మూడో వన్డేలో జడేజా రెండు వికెట్లను తీసి 150 వికెట్ల మార్కును దాటాడు. ఇంగ్లండ్ ఓపెనర్ సామ్ బిల్లింగ్స్ ను తొలి వికెట్ గా పెవిలియన్ కు పంపిన జడేజా.. వన్డేల్లో 150వ వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత లెఫ్టార్మ్ స్పిన్నర్గా జడేజా అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు.
టెస్టుల్లో 111 వికెట్లు తీసిన జడేజా.. ట్వంటీ 20ల్లో 31 వికెట్లను సాధించాడు. 2009 ఫిబ్రవరి 8వ తేదీన శ్రీలంకతో కొలంబోలో జరిగిన మ్యాచ్ ద్వారా జడేజా వన్డే అరంగేట్రం చేశాడు. ఆపై మూడేళ్ల తరువాత జడేజా టెస్టుల్లో చోటు సంపాదించి భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 322 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జాసన్ రాయ్(65;56 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), బిల్లింగ్స్(35;58 బంతుల్లో 5 ఫోర్లు)కు తోడు మోర్గాన్(43;44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), బెయిర్ స్టో(56;64 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), బెన్ స్టోక్స్(57 నాటౌట్;39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించడంతో ఆ జట్టు మరోసారి మూడొందల మార్కును చేరింది.