సిల్వర్‌ సింధు  | Sakshi
Sakshi News home page

సిల్వర్‌ సింధు 

Published Wed, Aug 29 2018 1:14 AM

PV Sindhu insists Tai Tzu Ying beatable if mistakes are worked upon - Sakshi

భారత స్టార్‌ షట్లర్‌ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు మళ్లీ నిరాశ తప్పలేదు. మరో మెగా ఈవెంట్‌లో ఆమె ఫైనల్లో పరాజయం పాలై రజత పతకంతోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. గత రెండేళ్ల వ్యవధిలో రియో ఒలింపిక్స్, రెండు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లు, వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్, కామన్వెల్త్‌ గేమ్స్‌లాంటి ప్రతిష్టాత్మక పోటీల్లో తుది పోరులో విజయాన్ని అందుకోలేకపోయిన సింధు ఇప్పుడు ఆసియా క్రీడల ఫైనల్లోనూ ఓడింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) 21–13, 21–16తో సింధును ఓడించింది. ఈ మ్యాచ్‌ 34 నిమిషాల్లోనే ముగిసింది. అయితే ఆసియా క్రీడల చరిత్రలో రజత పతకం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది.

సెమీస్‌లో ఓడిన సైనా నెహ్వాల్‌ కాంస్యం సాధించడంతో ఏషియాడ్‌లో తొలిసారి వ్యక్తిగత విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి.  ఫైనల్‌కు ముందు తై జుతో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ప్రపంచ మూడో ర్యాంకర్‌ సింధు ఈ సారైనా ఫలితం మార్చాలని పట్టుదలగా శ్రమించినా ఫలితం లేకపోయింది. తొలి గేమ్‌లో 5–0తో ముందంజలో నిలిచిన తై జు అదే జోరులో 16 నిమిషాల్లో గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్‌ ఆరంభంలో 4–4తో స్కోరు సమంగా ఉన్నా... తైపీ అమ్మాయి దూకుడుగా ఆడుతూ 15–10తో విజయంవైపు దూసుకెళ్లి వెనుదిరిగి చూడలేదు. ‘నాకు, తై జుకు మధ్య ఆటలో అంతరం మరీ ఎక్కువగా ఏమీ లేదు. ఆమెను కచ్చితంగా ఓడించగలను. నేను మరింత బాగా సన్నద్ధమై, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటే అది సాధ్యమే. మానసికంగా కూడా బాగానే ఉన్నాను. నేను కాస్త ఓపిగ్గా ఆడి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేది. రజతంతో కూడా సంతృప్తి చెందాను’ అని పీవీ సింధు వ్యాఖ్యానించింది. 
సింధుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు 

సాక్షి, హైదరాబాద్‌: రజతం నెగ్గిన తెలుగు తేజం పీవీ సింధుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.   

నాడు తండ్రి... నేడు కూతురు... 
పీవీ సింధు తండ్రి పీవీ రమణ ఖాతాలోనూ ఆసియా క్రీడల పతకం ఉంది. ఇప్పుడు సింధు రజతం సాధించగా... టీమ్‌ ఈవెంట్‌ వాలీబాల్‌లో రమణకు కాంస్యం దక్కింది. 1986 సియోల్‌ ఆసియా క్రీడల్లో మూడో స్థానంలో నిలిచిన భారత జట్టులో రమణ సభ్యులుగా ఉన్నారు. తండ్రీ కూతుళ్లిద్దరూ ఆసియా క్రీడల పతకాలు గెలుచుకోవడం, రెండు వేర్వేరు క్రీడాంశాలు కావడం విశేషం. 

Advertisement
Advertisement