పృథ్వీ షా మెరుపులు.. రోహిత్ శర్మ ఫిదా

Prithvi Shaw show as Mumbai beat Hyderabad - Sakshi

బెంగళూరు: భారత యువ ఓపెనర్ పృథ్వీ షా సంచలన బ్యాటింగ్‌తో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంటున్నాడు. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో (134, 70, 33 నాటౌట్‌ ) పరుగులు సాధించి అరంగేట్రంలో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన పృథ్వీ షా.. దేశవాళీ మ్యాచ్‌ల్లో భాగంగా విజయ్ హజారే ట్రోఫీలోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. బుధవారం బెంగళూరు వేదికగా హైదరాబాద్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పృథ్వీ షా (61; 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకం బాదాడు. దాంతో ముంబై అలవోకగా ఫైనల్‌కు చేరింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ అంబటి రాయుడు (11) విఫలమైనా.. రోహిత్ రాయుడు (121 నాటౌట్: 132 బంతుల్లో 8x4, 3x6) అజేయ శతకం బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 6 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదన‌కి దిగిన ముంబై జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ (17: 24 బంతుల్లో 2x4)తో నెమ్మదిగా ఆడినా.. పృథ్వీ షా మాత్రం భారీ షాట్లతో చెలరేగిపోయాడు.

ఇన్నింగ్స్‌ 9వ ఓవర్ వేసిన హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వరుస బౌన్సర్లతో పృథ్వీ షాని పరీక్షించేందుకు ప్రయత్నించి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. బౌన్సర్‌గా వచ్చిన ఆ ఓవర్‌లోని నాలుగో బంతిని అప్పర్ కట్ ద్వారా థర్డ్ మ్యాన్ దిశగా సిక్స్‌ బాదిన పృథ్వీ షా.. ఐదో బంతినీ ఫైన్ లెగ్ దిశగా బౌండరీ అవల పడేలా బాదేశాడు. దీంతో ఒత్తిడికి గురైన సిరాజ్.. చివరి బంతిని శరీరంపైకి వచ్చేలా విసిరినా.. దాన్నీ లెగ్ సైడ్‌ బౌండరీకి తరలించి 34 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. పృథ్వీ షా బ్యాటింగ్‌ని నాన్‌స్ట్రైక్ ఎండ్‌ని చూసిన రోహిత్ శర్మ ఫిదా అయిపోయాడు.

రోహిత్‌ రాయుడు సెంచరీ వృథా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top