
కరాచీ: దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన భారత ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైన చోట.. సౌరవ్ గంగూలీ ప్రతీ ఒక్క టీమిండియా అభిమాని గర్వించేలా చేశాడు. అవమానాలు ఎదురైన చోటే.. మ్యాచ్ గెలిచి ప్రతీ ఒక్క టీమిండియా అభిమాని కాలర్ ఎగరేసేలా చేశాడు దాదా. ఆ ఉద్విగ్న క్షణాలకు నేటికి 22 ఏళ్లు. సరిగ్గా ఇదే రోజున కరాచీ వేదికగా జరిగిన రెండో వన్డేలో గంగూలీ(89), వినోద్ కాంబ్లి(53) రాణించడంతో భారత్ 4 వికెట్ల తేడాతో అపూర్వ విజయాన్ని అందుకుంది.
ఇరుదేశాల మధ్య రాజకీయ సంక్షోభం కారణంగా 1989-90 తర్వాత 1997లో తొలిసారి పాక్‌లో టీమిండియా పర్యటించింది. పాక్ 50వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్-పాక్‌ల మూడు వన్డేల సిరీస్‌ను ఇరుదేశాల బోర్డు ఏర్పాటు చేశాయి. అయితే తొలి వన్డే సజావుగా సాగినప్పటికీ.. రెండో వన్డే యద్దవాతావరణాన్ని తలపించింది.
మ్యాచ్ మధ్యలో భారత అభిమానులు, క్రికెటర్లే లక్ష్యంగా కొందరు ఆకతాయిలు రాళ్ల దాడి చేశారు. దీంతో మ్యాచ్‌కు నాలుగు సార్లు అంతరాయం కలిగింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఓడిపోతే దానికి మించి అవమానం మరొకటి ఉండదు. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో సౌరవ్ గంగూలీ తన అసాధరణ ఆటతో గొప్ప విజయాన్ని అందించి యావత్ భారత్ అభిమానులు తలెత్తుకునేలా చేశాడు.
పలుమార్లు అంతరాయం కలగడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ భారత్ ముందు 266 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. అయితే కీలక బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్(21) స్వల్ప స్కోర్‌కే వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో కాంబ్లితో కలిసి గంగూలీ నిర్ణయాత్మకమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.
అయితే ఈ అపూర్వ ఘట్టం జరిగి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గంగూలీ అభిమానులు మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇక గంగూలీ పాక్ గడ్డపై మరోసారి మీసం మేలేసాడంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. క్లిష్ట సమయాల్లో గంగూలీ ప్రదర్శించే తెగువ అనిర్వచనీయమని మరికొందరు ప్రశంసిస్తున్నారు.