కివీస్‌ కుమ్మేసింది..

New Zealand Won By 10 Wickets Against Srilanka - Sakshi

కార్డిఫ్‌: వన్డే వరల్డ్‌కప్‌ సీజన్‌ను న్యూజిలాండ్‌ ఘనంగా ఆరంభించింది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత శ్రీలంకను కూల్చేసిన కివీస్‌.. ఆపై బ్యాటింగ్‌లో కుమ్మేసింది. శ్రీలంక​ నిర్దేశించిన 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. కివీస్‌ ఓపెనర్లు మార్టిన్‌ గప్టిల్‌( 73 నాటౌట్‌; 51 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), కొలిన్‌ మున్రో( 58నాటౌట్‌; 47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌)లు వికెట్‌ పడకుండా కివీస్‌కు విజయాన్ని అందించారు. పేలవమైన లంక బౌలింగ్‌పై విరుచుకుపడి 16.1 ఓవర్లలో జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇది కార్డిఫ్‌లో న్యూజిలాండ్‌కు నాల్గో వన్డే విజయం కాగా, లంక ఇక‍్కడ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది.
(ఇక్కడ చదవండి: లంక కెప్టెన్‌ అరుదైన ఘనత)

అంతకుముందు టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 29. 2 ఓవర్లలో 136 పరుగులకే చాపచుట్టేసింది. న్యూజిలాండ్‌ బౌలింగ్‌ ధాటిగా ఎదురొడ్డి నిలవకలేక చేతులెత్తేసింది. లంక బ్యాటింగ్‌ లైనప్‌లో కెప్టెన్‌ దిముత​ కరుణరత్నే(52 నాటౌట్‌: 84 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ సాధించడం మినహా అంతా విఫలమయ్యారు. లంక ఓపెనర్‌ తిరుమన్నే(4) ఆదిలోనే పెవిలియన్‌ చేరగా, కరుణరత్నేతో కలిసి కుశాల్‌ పెరీరా(29) 44 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత రెండో వికెట్‌గా ఔటయ్యాడు.  ఆ మరుసటి బంతికే కుశాల్‌ మెండిస్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ధనుంజయ డిసిల్వా కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఫెర్గ్యుసన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు డిసిల్వా.  ఏంజెలో మాథ్యూస్‌ డకౌట్‌ కాగా, జీవన్‌ మెండిస్‌ పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. తిషారా పెరీరా(27) కాసేపు క్రీజ్‌లో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లు డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం. . న్యూజిలాండ్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ, ఫెర్గ్యుసన్‌ తలో మూడు వికెట్లతో రాణించగా, అతనికి జతగా గ్రాండ్‌ హోమ్‌, జేమ్స్‌ నీషమ్‌, మిచెల్‌ సాంత్నార్‌, బౌల్ట్‌లు తలో వికెట్‌ తీశారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top