సర్దార్‌పై వేటు

ndian hockey team announces Commonwealth Games - Sakshi

కామన్వెల్త్‌ గేమ్స్‌కు భారత హాకీ జట్టు ప్రకటన 

న్యూఢిల్లీ: అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నీలో నిరాశాజనక ప్రదర్శనతో పాటు కెప్టెన్‌గా జట్టు వైఫల్యంలో భాగంగా నిలిచిన సీనియర్‌ ఆటగాడు సర్దార్‌ సింగ్‌పై హాకీ ఇండియా (హెచ్‌ఐ) నమ్మకం కోల్పోయింది. కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనే భారత జట్టు నుంచి సర్దార్‌ను తప్పించింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ఏప్రిల్‌ 7 నుంచి జరిగే ఈ పోటీల కోసం మంగళవారం జట్టును ప్రకటించారు. సర్దార్‌తో పాటు మరో సీనియర్‌ ప్లేయర్‌ రమణ్‌దీప్‌ సింగ్‌ను కూడా ఎంపిక చేయలేదు. 18 మంది సభ్యుల జట్టుకు మన్‌ప్రీత్‌ సింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా... చింగ్లెన్‌సనా సింగ్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. మన్‌ప్రీత్‌ సారథ్యంలోనే ఆసియా కప్‌ గెలుచుకున్న భారత్, హాకీ వరల్డ్‌ లీగ్‌ ఫైనల్లో కూడా కాంస్యం సాధించింది. గాయం నుంచి కోలుకున్న మరో సీనియర్‌ ఆటగాడు, మేటి గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌కు జట్టులో చోటు లభించింది. 

ఇటీవల జరిగిన అజ్లాన్‌ షా టోర్నీలో సర్దార్‌ ఆట తర్వాత అతనిపై వేటు ఖాయమనే కనిపించింది. అయితే ఇదే టోర్నీలో మెరుగ్గా ఆడిన రమణ్‌దీప్‌ను కూడా తప్పించడం ఆశ్చర్యపరచింది. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన కుర్రాళ్లు దిల్‌ప్రీత్‌ సింగ్, వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌లకు కామన్వెల్త్‌ అవకాశం దక్కింది. ‘2017 ఆసియా కప్‌తో మొదలు పెట్టి వేర్వేరు టోర్నీల్లో ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని జట్టును ఎంపిక చేశాం. మా దృష్టిలో కామన్వెల్త్‌ క్రీడల్లో పతకం సాధించగల అత్యుత్తమ జట్టు ఇది’ అని భారత కోచ్‌ జోయెర్డ్‌ మరీనే చెప్పారు.  

భారత హాకీ జట్టు: పీఆర్‌ శ్రీజేశ్, సూరజ్‌ కర్కేరా (గోల్‌ కీపర్లు), రూపిందర్‌పాల్‌ సింగ్, హర్మన్‌ప్రీత్‌ సింగ్, వరుణ్‌ కుమార్, కొతాజిత్‌ సింగ్, గురీందర్‌ సింగ్, అమిత్‌ రోహిదాస్‌ (డిఫెండర్లు), మన్‌ప్రీత్‌ సింగ్, చింగ్లెన్‌సనా సింగ్, సుమీత్, వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ (మిడ్‌ఫీల్డర్లు), ఆకాశ్‌దీప్‌ సింగ్, ఎస్వీ సునీల్, గుర్జంత్‌ సింగ్, మన్‌దీప్‌ సింగ్, లలిత్‌కుమార్‌ ఉపాధ్యాయ్, దిల్‌ప్రీత్‌ సింగ్‌ (ఫార్వర్డ్‌లు).

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top