ధోని విశ్రాంతి కొనసాగింపు!

Ms Dhoni Unlikely For India Vs South Africa T20 Series - Sakshi

రిషబ్‌ పంత్‌పైనే సెలక్టర్ల విశ్వాసం

దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌ కోసం వచ్చే నెల 4న జట్టు ఎంపిక

న్యూఢిల్లీ: సైన్యంలో రెండు వారాల పాటు పని చేసేందుకు వెస్టిండీస్‌తో సిరీస్‌ నుంచి విరామం కోరిన దోని తర్వాతి ప్రణాళిక ఏమిటి? త్వరలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు అందుబాటు లోకి వస్తాడా లేక అధికారిక ప్రకటన లేకుండానే రిటైర్మెంట్‌కు సిద్ధమయ్యాడా! మాజీ కెప్టెన్‌ వైపు నుంచి దీనిపై ఎలాంటి స్పష్టత లేకపోయినా సెలక్షన్‌ కమిటీ మాత్రం అతని పేరును పరిశీలించ కూడదని భావిస్తున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో మూడు టి20ల సిరీస్‌ కోసం సెప్టెంబర్‌ 4న జట్టును సెలక్టర్లు ఎంపిక చేయనున్నారు. వెస్టిండీస్‌ను 3–0తో చిత్తు చేసిన టీమ్‌నే సెలక్టర్లు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ధోనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరం.

మూడు ఫార్మాట్‌లలో భవిష్యత్‌ కీపర్‌గా రిషభ్‌ పంత్‌ ఇప్పటికే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ విశ్వాసం చూరగొన్నాడు. విండీస్‌తో చివరి టి20లో అతను చెలరేగి అర్ధసెంచరీ సాధించాడు. కాబట్టి మళ్లీ ధోనితో మళ్లీ వికెట్‌ కీపింగ్‌ చేయించి పంత్‌ను బ్యాట్స్‌మన్‌ ఆడించడం పక్కన పెట్టడం సరైన నిర్ణయం అనిపించుకోదు. పైగా 2020లో జరిగే టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని జట్టును సిద్ధం చేస్తున్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘ఇది కొత్తగా ఆలోచించాల్సిన సమయం. వచ్చే టి20 ప్రపంచ కప్‌కు ముందు భారత్‌ 22 మ్యాచ్‌లు ఆడుతుంది. కాబట్టి జట్టుపై సెలక్టర్లు ఒక విజన్‌ ఉంది. ఈ క్రమంలో వేర్వేరు కీపర్లకు కూడా అవకాశం కల్పించాలని వారు భావిస్తున్నారు. ఇందులో పంత్‌ ముందంజలో ఉన్నాడు. ఎ జట్టు తరఫున ఆడుతున్న ఇషాన్‌ కిషన్, సంజు శామ్సన్‌ల ఆటను కూడా సెలక్షన్‌ కమిటీ పరిశీలిస్తోంది. దూకుడుగా ఆడే కొత్త కుర్రాళ్లు అందుబాటులో లేనప్పుడు మళ్లీ గతంలోకి వెళ్లడం ఎందుకు’ అని ఆయన ప్రశ్నించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top