Madan Lal On Rishabh Pant: నేనైతే పంత్‌ కెప్టెన్‌ కాకుండా కచ్చితంగా అడ్డుకునేవాడిని! ధోని ఏమో అలా.. కోహ్లి ఇలా!

Ind Vs SA: Madan Lal Says Would Have Stopped Pant Becoming Captain - Sakshi

India Vs South Africa T20 Series- Rishabh Pant: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు రిషభ్‌ పంత్‌ను కెప్టెన్‌గా నియమించాల్సి కాదని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ మదన్‌ లాల్‌ అన్నాడు. తనకే గనుక అధికారం ఉండి ఉంటే కచ్చితంగా 24 ఏళ్ల ఈ యువ బ్యాటర్‌ను సారథిగా ఎంపిక చేసేవాడిని కాదన్నాడు. ఆటగాడిగా పంత్‌ మరింత మెరుగుపడాల్సి ఉందని, పూర్తి స్థాయిలో పరిణతి చెందిన తర్వాతే కెప్టెన్‌గా భారాన్ని మోయగలుగుతాడని అభిప్రాయపడ్డాడు.

కాగా ప్రొటిస్‌ జట్టుతో పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌లో సీనియర్ల గైర్హాజరీ నేపథ్యంలో పంత్‌ భారత జట్టు పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 2-2తో ఇరు జట్లు సమంగా నిలిచాయి. ఆఖరి మ్యాచ్‌ వర్షార్పణమైంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌లో పంత్‌ బ్యాటర్‌గా విఫలమయ్యాడు. మొత్తంగా కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు ఈ వికెట్‌ కీపర్‌.

ఇప్పుడే తొందర ఎందుకు?
ఈ నేపథ్యంలో మదన్‌ లాల్‌ మాట్లాడుతూ.. ‘‘నేనైతే పంత్‌ కెప్టెన్‌ కాకుండా అడ్డుకునేవాడిని. తాను సారథ్య బాధ్యతలు చేపట్టకుండా చేసేవాడిని. ఎందుకంటే.. బ్యాటర్‌గా తన సేవలు అవసరమైన వేళ పెద్ద పెద్ద బాధ్యతలు అప్పజెప్పడం సరికాదు.

టీమిండియా కెప్టెన్‌ అంటే మామూలు విషయం కాదు. అతడు వయసులో ఇంకా చిన్న వాడే. చాలా భవిష్యత్తు ఉంది. తను ఎక్కడికీ వెళ్లడం లేదు. ఆటగాడిగా మరింత పరిణతి సాధించాల్సి ఉంది. అప్పుడే ఇలాంటి బాధ్యతను సక్రమంగా నెరవేర్చగలడు’’ అని ఆజ్‌తక్‌తో పేర్కొన్నాడు.

ధోని కూల్‌ కెప్టెన్‌.. ఇక కోహ్లి అయితే..
ఇక రానున్న రెండేళ్ల కాలంలో పంత్‌ గనుక బ్యాటర్‌గా మరింత విజృంభిస్తే గొప్ప కెప్టెన్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మదన్‌ లాల్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ఎంఎస్‌ ధోని కూల్‌ కెప్టెన్‌ అని, సారథిగా జట్టుకు తను వందశాతం న్యాయం చేశాడన్న మదన్‌ లాల్‌.. విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా కంటే కూడా అద్భుతమైన బ్యాటర్‌గానే నీరాజనాలు అందుకున్నాడని గుర్తుచేశాడు. కాగా టీమిండియా ప్రస్తుతం రీషెడ్యూల్డ్‌ టెస్టు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్‌కు పయనమైన విషయం తెలిసిందే. 

చదవండి: Ind Vs Eng 5th Test: టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే ఇది! అతడు లేడు కాబట్టి... రోహిత్‌పై మరింత భారం!
India Tour Of England 2022 Schedule: ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా సై.. పూర్తి షెడ్యూల్‌, ‘జట్టు’ వివరాలు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top