వండర్.. మిక్స్‌డ్‌ జెండర్‌

Mixed Gender Tournaments in Cricket - Sakshi

త్వరలో పురుషులు, మహిళల క్రికెట్‌ టోర్నీ

టీ–20 తరహాలో నిర్వహణకు ఆర్‌సీబీ యోచన

ప్రపంచ కప్‌ అనంతరం వేదిక కానున్న ఇంగ్లండ్‌   

సిటీ నుంచి మిథాలీరాజ్, అరుంధతీరెడ్డి ప్రాతినిధ్యం  

క్రికెట్‌పై ఉన్న క్రేజ్‌ మరింత రెట్టింపు చేసేందుకు ‘రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు’ (ఆర్‌సీబీ) ఓఅడుగు ముందుకేసింది. టీ–20 మ్యాచ్‌లను మిక్స్‌డ్‌ జెండర్‌గా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఇండియన్‌ టీం నుంచి ఐదుగురు మహిళాక్రికెటర్లు, ఆరుగురు పురుషక్రికెటర్లతో జట్టు రూపొందించారు. కోహ్లీ, మిథాలీరాజ్, హర్మన్‌ ప్రీత్‌కౌర్, వేదకృష్ణమూర్తి తదితర క్రికెటర్లతో ఇటీవల ఆర్‌సీబీ ఓ ప్రోమోను రూపొందించింది. దీనిపై క్రికెట్‌ అభిమానుల్లో స్పందన ఎలా ఉంటుందోతెలుసుకునేందుకు ఆ వీడియోను యూ ట్యూబ్‌ వేదికగా విడుదల చేసింది. ప్రోమోను మెచ్చుకుంటూ కొన్ని గంటల్లోనే లక్షల్లో హిట్స్, వేలల్లో కామెంట్స్‌ రావడం గమనార్హం. మిక్స్‌డ్‌ జెండర్‌ క్రికెట్‌ వివరాలపై కథనం. 

ఏమిటీ మిక్స్‌డ్‌జెండర్‌ క్రికెట్‌.. ?
టీ– 20 క్రికెట్‌లో మన ఇండియన్‌ టీంలో పురుష క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లు కూడా ఇప్పుడు ఆడనున్నారు. ఆరుగురు మేల్‌ క్రికెటర్స్, ఐదుగురు ఫీమేల్‌ క్రికెటర్స్‌తో ఉన్న టీంని ‘మిక్స్‌డ్‌ జెండర్‌ క్రికెట్‌’ టీంగా పిలుస్తారు. ఆర్‌సీబీ విడుదల చేసిన వీడియోకు బీసీసీఐ నుంచి మంచి స్పందన వచ్చింది. మన దేశంతో పాటు ఇతర దేశాల వాళ్లు కూడా ముందుకొచ్చారు. ప్రస్తుతం నాలుగు దేశాలకు చెందిన వాళ్లు మిక్స్‌డ్‌ క్రికెట్‌ టీంకి ఆటగాళ్లను ఇచ్చినట్లుసమాచారం.  

ప్రపంచ వ్యాప్తంగా నాలుగు జట్లు..
మిక్స్‌డ్‌ జెండర్‌ క్రికెట్‌ టోర్నీకి ఇప్పటికే ప్రపంచవ్యాప్తగా నాలుగు జట్లను ఎంచుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్‌ పోటీలు ముగిసిన తర్వాత జూలైలో ఇంగ్లండ్‌ వేదికగా ‘మిక్స్‌డ్‌ జెండర్‌ క్రికెట్‌’ని నిర్వహించేందుకు ‘ఆర్‌సీబీ’ సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో మన హైదరాబాద్‌ నుంచి ఇద్దరు మహిళా క్రికెటర్లు ప్రాతినిధ్యం వహించనున్నారు.సీనియర్‌ క్రికెటర్‌ మిథాలీరాజ్, ఇటీవల టీ–20కి బౌలర్‌గా ఎంపికైన అరుంధతీరెడ్డి మిక్స్‌డ్‌ జెండర్‌ క్రికెట్‌లో ఆడనున్నట్లు క్రికెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 

ఐడియా బాగుంది..

‘అవకాశం ఇచ్చి చూస్తేనే కదా మేం ఎంత బాగా ఆడతామనేది తెలిసేది. మిక్స్‌డ్‌ జెండర్‌ క్రికెట్‌ ఐడియా నాకు బాగా నచ్చింది. కేవలం మేల్‌ క్రికెటర్లలోనే కాదు అమ్మాయిల్లో కూడా 100–115 కి.మీ వేగంతో ఫాస్ట్‌ బౌలింగ్, స్పిన్‌ బౌలింగ్‌ చేయగలిగేవాళ్లు ఉన్నారు. మేల్‌ క్రికెటర్లతో కలిసి ఆడుతున్న సమయంలో మేం వారిని నుంచి నేర్చుకునే చాన్స్‌ కూడా దక్కుతుంది’     – అరుంధతీరెడ్డి, ఇండియన్‌ టీ– 20 బౌలర్‌

క్రికెట్‌ అభిమానులకు విందే..
మేల్‌ అండ్‌ ఫీమేల్‌ క్రికెటర్లు కలిసి ఒకే జట్టులో ఆడటం ఎంతో కనువిందుగా ఉంటుంది. క్రీడాభిమానులకు ఇది ఒక ఫన్‌ లాంటిదే. 110– 115 కి.మీ వేగం ఫాస్ట్‌ బౌలింగ్‌లో ఫీమేల్‌ క్రికెటర్లు అవలీలగా ఆడగలరు. 140 కి.మీ బౌలింగ్‌ మాత్రం వారికి కొద్దిగా కష్టం. దీనిని పరిశీలిస్తే బాగుంటుందనేది నా ఆలోచన.     – మూర్తి, మిథాలీరాజ్‌ సౌత్‌సెంట్రల్‌ రైల్వేస్‌ కోచ్‌  

నిజంగా సాహసమే..‘రెండేళ్ల క్రితం జరిగిన మహిళా ప్రపంచ కప్‌లో అతివలు సైతం క్రికెట్‌ను బాగా ఆడగలరనే విషయం యావత్‌ ప్రపంచానికి తెలిసింది. మేం ఓడినప్పటికీ కొన్ని కోట్ల మంది మా ఆటను, మా ధైర్యాన్ని మెచ్చుకున్నారు. దీంతో అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. టీ– 20 తరహాలో పురుష  క్రికెటర్లతో పాటు మమ్మల్ని కూడా భాగస్వాముల్ని చేయడం, ఒకటే టీంలో అందరం కలిసి ఆడటం నిజంగా సాహసమే. ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం’    – మిథాలీరాజ్, భారత మహిళా  క్రికెటర్‌

తేడా ఏమీ ఉండదు..
నాకు తెలిసి మేల్‌ అండ్‌ ఫీమేల్‌ క్రికెటర్ల మధ్య పెద్ద తేడా ఏమీ ఉండదు. ఫీమేల్‌ క్రికెటర్‌లో కూడా హైస్పీడ్‌ 120– 130 కి.మీ బౌలింగ్‌ వేయగలిగేవాళ్లు ఉన్నారు. ఉమెన్‌ కూడా భారీ షాట్స్‌తో సిక్స్, ఫోర్లు కొట్టగలరు. వారికి మిక్స్‌డ్‌ జెండర్‌ క్రికెట్‌ ఓ వరమే.  మరింత మంది అమ్మాయిలు క్రికెట్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది.            – సువర్ణ, సౌత్‌సెంట్రల్‌ రైల్వేస్‌ అసిస్టెంట్‌ కోచ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top