నాకు గుర్తింపు దక్కడం లేదు! | Memories of 'painful' 2013 still hurting, says badminton player Jwala Gutta | Sakshi
Sakshi News home page

నాకు గుర్తింపు దక్కడం లేదు!

May 1 2014 8:36 AM | Updated on Sep 2 2017 6:44 AM

నాకు గుర్తింపు దక్కడం లేదు!

నాకు గుర్తింపు దక్కడం లేదు!

అంతర్జాతీయ టోర్నీల్లో పలు పతకాలు సాధించినా... దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కలేదని అగ్రశ్రేణి డబుల్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుతా జ్వాల వాపోయింది. ప్రస్తుతం వివాదాలు మరచి ఉబెర్ కప్‌పై దృష్టి సారించానని, రియో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సన్నద్ధమవుతానని చెప్పింది.

 ‘డబుల్స్’ అంటే అలుసెందుకు?
 గుత్తా జ్వాల వ్యాఖ్య
 
 న్యూఢిల్లీ: అంతర్జాతీయ టోర్నీల్లో పలు పతకాలు సాధించినా... దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కలేదని అగ్రశ్రేణి డబుల్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుతా జ్వాల వాపోయింది. ప్రస్తుతం వివాదాలు మరచి ఉబెర్ కప్‌పై దృష్టి సారించానని, రియో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సన్నద్ధమవుతానని చెప్పింది. 30 ఏళ్ల ఈ హైదరాబాదీ ఇటీవల జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో కాంస్య పతకంతో సత్తాచాటిన సంగతి తెలిసిందే.
 
 ఇంతకుముందు కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచినప్పటికీ... కేవలం ‘డబుల్స్’ ముద్రతో అంతగా లైమ్‌లైట్‌లోకి రాలేకపోయింది. దీనిపై బాహటంగానే భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)పై విమర్శలు గుప్పించిన జ్వాల డబుల్స్ అంటే చిన్న చూపెందుకని మరోసారి ప్రశ్నించింది. దశాబ్దానికిపైగా నిలకడైన కెరీర్‌ను కొనసాగిస్తున్న జ్వాల దీనిపై మాట్లాడుతూ ‘నేను సాధించిన పతకాలకు నజరానాలు అడగడం లేదు. నగదు ప్రోత్సాహకాలు అక్కర్లేదు. నేనూ మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్‌ననే గుర్తింపు కావాలి. ‘సింగిల్స్’లాగే నా విజయాలను గౌరవిస్తే చాలు’ అని చెప్పింది. ఒలింపిక్స్ (లండన్)లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన తాను మేటి అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించానంది. అయినా... ఇంకా తానేం నిరూపించుకోవాలో అర్థం కావడం లేదని పేర్కొంది.
 
   ఇలాంటి ఘనవిజయాలున్న తన స్థానాన్ని భర్తీచేసే క్రీడాకారిణి ఎవరూ లేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పరోక్షంగా బాయ్‌కు చురకలంటించింది. ‘ఎవరి మద్దతు లేకుండానే అనుకున్నవి సాధించాను. నా పతకాలను అసోసియేషన్ (బాయ్) గుర్తించకపోగా... లేని సాకుతో ఏకంగా వేటుకూ యత్నించారు. అయినా అన్నీ భరించాను. న్యాయపోరాటం చేశాను. ఏబీసీలో మళ్లీ నన్ను నేను నిరూపించుకున్నాను’ అని తెలిపింది. తన భాగస్వామి అశ్విని పొనప్ప కూడా రాణిస్తున్నా... ‘డబుల్స్’ నీడనే మగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. గత ఆరునెలలుగా నరకం అనుభవించానని తిరిగి ఏబీసీ పతకంతో విమర్శలకు ప్రదర్శనతోనే బదులిచ్చానని జ్వాల పేర్కొంది. మానసిక స్థైర్యంతోనే ఇది సాధ్యమైందని, తాజా పతకంతో తమ జోడి స్థైర్యం పెరిగిందని, ఇదే జోరుతో ముందడుగు వేస్తామని చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement