మంకీగేట్‌ : మర్చిపోలేని వివాదం

Match referee Mike Procter recalls the Monkeygate issue - Sakshi

జోహాన్స్‌బర్గ్‌ : క్రికెట్‌ ప్రేమికులందరికీ మంకీగేట్‌ వివాదం బాగా గుర్తుండే ఉంటుంది. హర్భజన్‌ సింగ్‌, ఆండ్రూ సైమండ్స్‌ మధ్య వివాదాన్ని దశాబ్దం తరువాత నాటి మ్యాచ్‌ రెఫరీ మైక్‌ ప్రోక్టర్‌ మరోసారి తెరమీదకు తెచ్చాడు. ఈ ఘటనపై మైక్‌ ప్రొక్టర్‌ సచిన్‌ పాత్రపై సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించాడు. రెఫరీగా తన అనుభవాలను పొందుపరుస్తూ మైక్‌ ప్రోక్టర్‌ తన ఆత్మకథను రచించాడు. అందులో 2008 సిడ్నీటెస్ట్‌ మంకీగేట్‌ ఉదంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 

సిడ్నీలో రెండో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ తన దగ్గరికి వచ్చి.. హర్భజన్‌ సింగ్‌ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదు చేశాడు. బౌలింగ్‌ ఎండ్‌కు సమీపంలో ఉన్న ఆల్‌ రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ని మంకీ అని సంబోధించినట్లు పాంటింగ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

పాంటింగ్‌ ఫిర్యాదుపై సచిన్‌ టెండూల్కర్‌ తీవ్రంగా స్పందించాడు. హర్భజన్‌ మంకీ అనలేదని.. హిందీలో ‘తేరి మా.. కి...’ అని అన్నట్లు సచిన్‌ విచారణ కమిటీ ముందు స్పష్టం చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న నేను హర్భజన్‌పై మూడు టెస్టుల నిషేధాన్ని విధించినట్లు మైక్‌ ప్రోక్టర్‌ ఆత్మకథలో గుర్తు చేసుకున్నారు. అయితే, అప్పీల్స్ కమిషనర్ జాన్ హనెసన్ ముందు హర్భజన్‌కు సచిన్ మద్దతుగా నిలవడంతో, అతను ఈ శిక్షను రద్దు చేశారు. 

హర్భజన్‌కు శిక్ష రద్దు చేయడం నన్ను చాలా నిరుత్సాహ పరిచిందని ప్రోక్టర్‌ ఆత్మకథలో పేర్కొన్నారు. మాకు 22 గజాల దూరంలో ఉన్న సచిన్‌ టెండూల్కర్‌కు ‘మంకీ’ ‘మా..కీ’ అనే పదాల మధ్య వ్యత్యాసం అంత స్పష్టంగా ఎలా వినిపించిందన్నదే నాకు అంతుచిక్కలేదని అందులో తెలిపారు. విచారణ కమిటీ ముందు తనకు ఇంగ్లీషు పెద్దగా రాదని హర్భజన్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. హర్భజన్‌కు ఇంగ్లీష్‌ బాగా వస్తుందని.. అయితే వివాదం నుంచి బయటపడేందుకే అతను అలా చెప్పివుంటాడని ఆత్మకథలో ప్రోక్టర్‌ రాసుకున్నారు. అత్యున్నత స్థాయి వ్యక్తులు, శక్తుల జోక్యంతో వివాదం సద్దుమణిగిందని పుస్తకంలో ఆయన పేర్కొన్నారు. ఈ వివాదంలో హర్భజన్‌కు సచిన్‌ టెండూల్కర్‌తో పాటు, జట్టు మేనేజర్‌ చేతన్‌ చౌహాన్‌,  బీసీసీఐ కూడా మద్దతు తెలిపిందని అందులో చెప్పుకొచ్చారు.  

భారత్‌ క్రికెట్‌ జట్టు 2007-08 సీజన్‌లో ఆస్ట్రేలియాలో పర్యటిచింది. భారత జట్టు సిడ్నీలో రెండో టెస్టు ఆడుతోంది. ఆడుతున్న భారత్‌ భారత ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఆస్ట్రేలియన్‌ ఆల్‌ రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ని మంకీ అని సంబోధించినట్లు వివాదం చెలరేగింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top