నేను రివ్యూకు వెళ్లాల్సింది కాదు: రాహుల్‌

KL Rahul Says I Should Not Have Taken The Review - Sakshi

దుబాయ్‌: ఆసియాకప్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పసికూన అఫ్గానిస్తాన్‌ బలమైన భారత్‌ను ఓడించినంత పనిచేసిన విషయం తెలిసిందే. సులువుగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌ అంపైర్‌ తప్పిదాలతో భారత్‌ డ్రాతో సరిపెట్టుకుంది. అద్యాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ చాలా రోజుల తర్వాత ప్రేక్షకులకు అసలు సిసలు క్రికెట్‌ మ్యాచ్‌ రుచి చూపించింది. అయితే ఈ  మ్యాచ్‌ అనంతరం అభిమానులు ఎవరికి తోసిన విశ్లేషణలు వారు చేస్తున్నారు. ‘ఛ.. ధోని, కార్తీక్‌లు కొద్దిసేపు క్రీజులో ఉంటే ఈ పరిస్థితే వచ్చేది కాదు.. అంపైర్‌ తప్పుడు నిర్ణయం సవాల్‌ చేసే అవకాశం లేకపోయే.. అసలు కేఎల్‌ రాహుల్‌ ఎందుకు ఉన్న ఒక్క రివ్యూ వృథా చేశాడు.’ అని అతనిపై నిందేస్తున్నారు. ధోని ఔట్‌ కావడానికి కూడా రాహులే కారణమంటూ మండిపడుతున్నారు. (చదవండి: ‘ధోనిని ఔట్‌ చేసింది రాహులే‌’)

మ్యాచ్‌ అనంతరం కేఎల్‌ రాహుల్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తాను రివ్యూకు తీసుకోవాల్సింది కాదని చెప్పుకొచ్చాడు. ‘ఒకే రివ్యూ అవకాశం ఉన్నప్పుడు చాలా కష్టం. కానీ నేను ఆ సమీక్షకు వెళ్లాల్సింది కాదు. కానీ ఆ సమయంలో బంతి అవతలివైపు వెళ్లిందో ఏమో అని భావించాను. అలా వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకున్నాను. మేం బాధపడటం లేదు బంతి నెమ్మదిగా స్పిన్‌ అవుతోంది. ఇది మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌కు చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో కూడా దినేశ్‌ కార్తీక్‌ అద్భుతంగా ఆడాడు. కేదార్‌ జాదవ్‌తో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో జడేజా,దీపక్‌ చహల్‌ పోరాటం కూడా ఆకట్టుకుంది. ఓపెనర్‌గా బరిలోకి దిగినప్పుడే మిడిలార్డర్‌పై ఒత్తిడి లేకుండా చేయాలనుకున్నాను’ అని తెలిపాడు.

చివరి ఓవర్లో విజయానికి భారత్‌కు 7 పరుగులు కావాలి.  క్రీజ్‌లో జడేజా ఉన్నాడు. నాలుగు బంతుల తర్వాత స్కోర్లు సమమయ్యాయి. మరో రెండు బంతుల్లో సింగిల్‌ తీయాల్సి ఉండగా అఫ్గాన్‌ సంచలనం జడేజాను బోల్తా కొట్టించాడు. జడేజా భారీ షాట్‌కు ప్రయత్నించి  క్యాచ్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది. (చదవండి: ఊరించి... ఉత్కం‘టై’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top