డిప్యూటీ కలెక్టర్‌గా కిడాంబి బాధ్యతలు

Kidambi srikanth takes over as deputy collector - Sakshi

విజయవాడ: బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాంత్‌ ప్రతిభను గుర్తించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అతన్ని డిప్యూటీ కలెక్టర్‌ హోదాతో గౌరవించింది. గత ఏడాది విజయవాడలో నిర్వహించిన అభినందన సభలో సీఎం చంద్రబాబు నాయుడు.. శ్రీకాంత్‌ను గ్రూప్-1 సర్వీసెస్‌లో నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్పోర్ట్స్‌ కోటా కింద ఈ నియామకం చేపట్టారు.

తాజాగా డిప్యూటీ కలెక్టర్‌గా కిడాంబి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు గొల్లపూడిలో భూ పరిపాలన కమిషనర్ అనిల్ చంద్ర నుంచి శ్రీకాంత్‌ నియామక పత్రాలు స్వీకరించారు. దీనిలో భాగంగా అనిల్‌ చంద్ర మాట్లాడుతూ.. శ్రీకాంత్‌ వంటి అగ్రశ్రేణి క్రీడాకారుడు తమ శాఖ పరిధిలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీకాంత్‌ క్రీడల్లో రాణించినట్లే ఉద్యోగంలో కూడా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఇక తన పోస్టింగ్‌పై శ్రీకాంత్‌ స్పందిస్తూ తనను ప్రోత్సహించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. తాను కోరినట్లే గుంటూరులో పోస్టింగ్‌  ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

గుంటూరుకు చెందిన కిదాంబి శ్రీకాంత్‌ ఈ ఏడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ను కైవసం చేసుకున్నారు. ఇండోనేషియా ఓపెన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తోపాటు డెన్మార్క్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరిస్‌లను నెగ్గిన శ్రీకాంత్‌.. ఒకే ఏడాది నాలుగు టైటిళ్లు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు.ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో భాగంగా వ్యక్తిగత విభాగంలో శ్రీకాంత్‌ రజత పతకం సాధించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top