‘బూమ్‌’లా దూసుకొచ్చి...

jasprit bumrah may feature in third Test   - Sakshi

టెస్టుల్లో సత్తా చాటుతున్న బుమ్రా 

టి20ల నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎదిగిన వైనం

విదేశీ పర్యటనల్లో  కనిపించిన దూకుడు   

జొహన్నెస్‌బర్గ్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు... నాటింగ్‌హామ్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు... అడిలైడ్‌ టెస్టులో ఆరు కీలక వికెట్లు... ఈ ఏడాది భారత జట్టు విదేశీ గడ్డపై సాధించిన మూడు టెస్టు విజయాల్లో కూడా పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ప్రధాన పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ఆడింది ఏడు టెస్టులే... కానీ అతను చూపించిన ప్రభావం మాత్రం చాలా ఎక్కువ. ఆడిన ప్రతీ టెస్టులో కనీసం మూడు వికెట్లయినా తీసిన బుమ్రా ఇప్పటి వరకు 24.44 సగటుతో 34 వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో, ముఖ్యంగా ఐపీఎల్‌లో యార్కర్‌ స్పెషలిస్ట్‌గానే ఆరంభంలో గుర్తింపు తెచ్చుకున్న ఈ బౌలర్‌ అమిత వేగంగా టెస్టు బౌలర్‌గా పరిణతి సాధించాడు. అతని వైవిధ్యమైన శైలికి వేగం కూడా తోడవడంతో బుమ్రా ప్రమాద కరంగా మారిపోయాడు. ఇలాంటి బౌలర్‌ తమ జట్టులో కూడా ఉంటే బాగుండేదని అన్ని జట్లు కోరుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు.   

సాక్షి క్రీడా విభాగం: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బుమ్రా 153.26 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. ఈ మ్యాచ్‌లో అన్నింటికంటే వేగవంతమైన బంతి ఇదే. అటువైపు స్టార్క్, కమిన్స్‌లాంటి మెరుపు వీరులకు కూడా సాధ్యం కానిది అతను చేసి చూపించాడు. అంతకు కొద్దిసేపు ముందు కూడా 144.8 నుంచి 148.7 కిలోమీటర్ల మధ్య అతను నిలకడగా బంతులు వేశాడు. మ్యాచ్‌లో అతని సగటు వేగం 146 కావడం గమనార్హం. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న షాన్‌ మార్‌‡్షను రెండు ఓవర్ల పాటు కేవలం వేగంతో ఆడుకున్న తీరు అసాధారణం. ఆ తర్వాత అద్భుతమైన ఔట్‌ స్వింగర్‌తో అతడిని ఔట్‌ చేసి విజయానికి బుమ్రా బాటలు పరిచాడు. అనంతరం పైన్, కమిన్స్‌లను కూడా బుమ్రానే పెవిలియన్‌ పంపించడంతో గెలుపు దాదాపుగా ఖాయమైంది. చిన్నపాటి రనప్‌తోనే బుమ్రా అంత వేగం రాబడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన నాటి నుంచి ప్రతీ దశలో నేర్చుకుంటూ ఆటను మెరుగుపర్చుకుంటున్న ఈ గుజరాతీకి ఏ సవాల్‌ కూడా పెద్దదిగా అనిపించడం లేదు.  

ఐపీఎల్‌తో దూసుకొచ్చి... 
2013 ఐపీఎల్‌లో తన తొలి మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి సహా మూడు వికెట్లు తీసినప్పుడు ముంబై ఇండియన్స్‌ ‘కొత్త స్టార్‌ ఉదయించాడు’ అని వ్యాఖ్య పెట్టింది. అయితే ఎవరూ దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఐపీఎల్‌ ప్రవాహంలో వేగంగా దూసుకొచ్చి అంతే వేగంగా కనుమరుగైపోయే అనేక మంది ఆటగాళ్లలో ఒకడిగా ఇతనూ చేరతాడని అంతా భావించారు. అంతకు ముందే ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఉన్నా, గుజరాత్‌ తొలిసారి విజయ్‌ హజారే ట్రోఫీ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించినా అతడిపై ఎవరూ ఆసక్తి కనబర్చలేదు. అయితే 2016 ఆరంభంలో భారత టి20 జట్టులోకి ఎంపికై, అనుకోకుండా వన్డే మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం దక్కించుకున్న బుమ్రాకు మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రధాన బౌలర్‌గా అతను భారత్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆరంభ ఓవర్లలో, డెత్‌ స్పెషలిస్ట్‌గా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను దెబ్బ తీయాలంటే అది బుమ్రాకే చెల్లింది.  

జోరు కొనసాగింది... 
సంప్రదాయానికి భిన్నమైన బౌలింగ్‌ శైలి, బుమ్రా బంతిని వదిలే తీరు బ్యాట్స్‌మెన్‌ను గందరగోళంలో పడేస్తాయి. సాధారణంగా బౌలర్‌ బంతి గ్రిప్‌ను బట్టి అది ఎలాంటి బంతో అంచనా వేయగల మేటి ఆటగాళ్లు కూడా అతని బౌలింగ్‌లో ఇబ్బంది పడిపోతున్నారు. కచ్చితమైన యార్కర్లకు తోడు ప్రధానంగా కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు సృష్టించడం బుమ్రా ప్రత్యేకత. తెలివైన బౌలింగ్‌కు తోడు ఇప్పుడు వేగం కూడా వచ్చి చేరడంతో అతని అమ్ములపొదిలో అస్త్రాలు పెరిగిపోయాయి. సఫారీ సిరీస్‌ తర్వాత గాయంతో ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరమైన బుమ్రా నాటింగ్‌హామ్‌కు రాగానే తన ప్రభావం చూపించాడు. అతని బౌలింగ్‌ను ఆడటంలో తీవ్రంగా ఇబ్బంది పడి ఒత్తిడికి గురైన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 168 పరుగుల భారీ ఆధిక్యం సమర్పించుకొని ఓటమిని ఆహ్వానించింది. ఇంగ్లండ్‌లో పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకున్న అతను తర్వాతి రెండు టెస్టుల్లో కూడా కీలక సమయాల్లో వికెట్లు తీసి తన ముద్రను ప్రదర్శించాడు.  

సవాల్‌ విసురుతూ... 
బుమ్రాను టెస్టులకు ఎంపిక చేయడం ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటిగా చెప్పవచ్చు. కొన్నిసార్లు స్కోరు బోర్డులో వికెట్ల సంఖ్య వద్ద అతని పేరు కనిపించకపోయినా అతను జట్టుకు చేకూరుస్తున్న విలువ అమూల్యం. ఒక విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ ఎదురుగా ఉంటే ప్రత్యర్థి బౌలర్లు ఎలా భయపడతారో... బుమ్రా బంతిని ఆడేందుకు కూడా బ్యాట్స్‌మెన్‌ అదే తరహాలో తడబడుతున్నారు. తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడేందుకు వచ్చినా బుమ్రాపై సిరీస్‌కు ముందు భారీ అంచనాలే ఉన్నాయి. అడిలైడ్‌లో అతను తనేమిటో చూపించాడు. ఇప్పుడు పేసర్లకు స్వర్గధామమైన పెర్త్‌లో కూడా అతను మరింత ప్రమాదకారి కాగలడు. ఇప్పటి వరకు చేసిన ప్రదర్శనను బట్టి చూస్తే భారత అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా నిలిచే సత్తా బుమ్రాకు ఉందని ఖాయంగా చెప్పవచ్చు.

అనూహ్యపిలుపుతో... 
నలుగురు రెగ్యులర్‌ పేస్‌ బౌలర్లు జట్టులో ఉండగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు బుమ్రాను ఎంపిక చేయడమే ఆశ్చర్యం కలిగించింది. అప్పటి వరకు 26 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో బుమ్రా 89 వికెట్లు తీశాడు. ఇది అద్భుత ప్రదర్శన ఏమీ కాదు. ఎర్ర బంతితో క్రికెట్‌ ఆడి అతను సంవత్సరమైంది. అయినా అనుభవం కోసం తీసుకెళుతున్నారు తప్ప ఆడించకపోవచ్చని కూడా వినిపించింది. కానీ ప్రత్యర్థిని ఆశ్చర్యపరిచేందుకు కేప్‌టౌన్‌ టెస్టులో బుమ్రా అనే కొత్త ఆయుధాన్ని కోహ్లి బయటకు తీశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఒకే ఒక వికెట్‌ తీసినా అది అద్భుతమైన బంతితో డివిలియర్స్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసింది కావడం విశేషం! భారత్‌లోని పిచ్‌లపై వేసినట్లు సరైన ‘లెంగ్త్‌’ కుదరక ఇబ్బంది పడ్డాడు. అయితే తప్పుల నుంచి తొందరగా పాఠాలు నేర్చుకుంటాడని జట్టులో అతనికి మంచి పేరుంది. రెండో ఇన్నింగ్స్‌లో కుదురుకున్న బుమ్రా వరుస ఓవర్లో రెండు అద్భుత బంతులతో డు ప్లెసిస్, డి కాక్‌లను ఔట్‌ చేశాడు. ఈసారి కూడా తెలివైన బంతితో డివిలియర్స్‌ను బోల్తా కొట్టించగలిగిన తనపై సెలక్టర్లు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. జొహ న్నెస్‌బర్గ్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతను తీసిన ఐదు వికెట్లతోనే భారత్‌కు ఆధిక్యం దక్కింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top