
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక ఉబెర్ కప్‌ను 37 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం జపాన్ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3–0తో థాయ్‌లాండ్‌ను మట్టికరిపించి సగర్వంగా కప్‌ను ముద్దాడింది. చివరిసారిగా జపాన్ 1981లో ఉబెర్ కప్ విజేతగా నిలిచింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి 21–15, 21–19తో నాలుగో ర్యాంకర్ ఇంతనోన్ రచనోక్‌పై గెలిచి ఆధిక్యం అందించగా... రెండో మ్యాచ్‌లో యూకీ ఫుకుషిమా–సయాకా హిరోట జంట 21–18, 21–12తో జొంగ్‌కొల్పాన్ కిటిథరాకుల్–పుట్టిట సుపాజిరాకుల్ జోడీపై గెలిచి ఆధిక్యాన్ని 2–0కు పెంచింది.
మూడో మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా 21–12, 21–9తో నిచావోన్ జిందాపోల్‌పై గెలిచి జపాన్‌కు మరపురాని విజయాన్ని అందించింది. అంతకుముందు థాయ్‌లాండ్ సెమీస్‌లో పటిష్ట చైనాపై విజయంతో తుదిపోరుకు చేరగా... కొరియాపై విజయంతో జపాన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. క్రితంసారి కాంస్యం సాధించిన భారత బృందం ఈసారి లీగ్ దశలోనే వెనుదిరిగింది.