
కేప్ టౌన్ : భారత్ -దక్షిణాఫ్రికాల మధ్య సిరీస్ విరాట్ కొహ్లీ వర్సెస్ ఏబీ డివిలియర్స్‌గా ఎందుకు మారిందో తనకు అర్థం కావడం లేదని భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ పేర్కొన్నారు. సిరీస్‌లో తామిద్దరమే ఆడటం లేదని అన్నారు. ఏబీ తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పారు. అతను ఆడే తీరు తనను బాగా నచ్చుతుందని వెల్లడించారు.
కానీ, ప్రత్యర్థులుగా ఆడుతున్న సమయాల్లో ఇద్దరం హద్దులు దాటబోమని చెప్పారు. కేవలం డివిలియర్స్‌ను ఔట్ చేయడం ద్వారా భారత్ టెస్టు మ్యాచ్‌ను గెలవదని అన్నారు. మనం ఎలా ఏబీని ఔట్ చేయాలి అనుకుంటామో.. ప్రత్యర్థి జట్టు తనను లేదా పుజారాను లేదా రహానేను ఔట్ చేయాలని భావిస్తుందని చెప్పారు.
పటిష్టంగా ఉన్న దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్‌లలో టీమిండియా విజయాలను సాధిస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. టీంలో యువరక్తం ఉరకెలెత్తుతోందని చెప్పారు. అవకాశం కోసం వారందరూ ఎదురుచూస్తున్నారని.. ఇది శుభపరిణామం అని చెప్పారు.