అంతా కలలా అనిపిస్తోంది: హిమ 

 Its been like a dream so far, says Hima Das - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ అండర్‌–20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన భారత అథ్లెట్‌ హిమ దాస్‌ తాను కలలో విహరిస్తున్నట్లు ఉందని అంటోంది. ఫిన్లాండ్‌లో గురువారం జరిగిన ఈ చాంపియన్‌షిప్‌ 400 మీటర్ల పరుగులో అస్సాంకు చెందిన హిమ దాస్‌ 51.46 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.  తద్వారా ఈ మెగా ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గిన తొలి మహిళా అథ్లెట్‌గా ఆమె కొత్త చరిత్ర సృష్టించింది. ‘దేశం కోసం ఏదో సాధించాలనే సానుకూల దృక్పథంతోనే ముందడుగు వేశాను.

ప్రస్తుతం ఈ విజయం నాకు కలలో ఉన్న భావన కలిగిస్తోంది’ అని తెలిపింది. స్వర్ణం నెగ్గిన హిమ దాస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచిన హిమకు శుభాకాంక్షలు. నీ ఘనతను చూసి దేశం గర్విస్తోంది. నీ విజయం రాబోయే కాలంలో యువకులకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ‘హిమ దాస్‌కు అభినందనలు. ఇది యావత్‌ భారత జాతి గర్వించే సమయం. ఒలింపిక్‌ పోడియంపై నిలవాలని ఆశిస్తున్నాం’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top