భారత మహిళల జట్టుకు రజతం

భారత మహిళల జట్టుకు రజతం


ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్

 

బ్యాంకాక్: ‘పసిడి’ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల ఆర్చరీ జట్టు చివరి మెట్టుపై తడబడింది. ఫలితంగా ఆసియా చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సంతృప్తి పడింది. ఆదివారం జరిగిన మహిళల రికర్వ్ టీమ్ విభాగం ఫైనల్లో దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణి మాఝీలతో కూడిన భారత జట్టు 3-5తో చాంగ్ హై జిన్, సునమ్ హాంగ్, లీ టుక్ యంగ్‌లతో కూడిన దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయింది. భారత జట్టు తొలి రౌండ్‌ను 58-57తో నెగ్గి 2-0తో ముందంజ వేసింది. అయితే రెండో రౌండ్‌ను కొరియా 58-52తో గెల్చుకొని స్కోరును 2-2తో సమం చేసింది. మూడో రౌండ్‌లో రెండు జట్లూ 55 చొప్పున స్కోరు చేసి ఒక్కో పాయింట్‌ను సొంతం చేసుకోవడంతో సెట్ స్కోరు 3-3తో సమమైంది.



నాలుగో రౌండ్‌ను కొరియా బృందం 57-55తో నెగ్గి మ్యాచ్‌ను 5-3తో కైవసం చేసుకుంది. మరోవైపు జయంత, అతాను దాస్, మంగళ్‌సింగ్ చాంపియాలతో కూడిన భారత పురుషుల రికర్వ్ జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. కాంస్య పతక పోరులో భారత జట్టు ‘షూట్ ఆఫ్’లో చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయింది. వ్యక్తిగత విభాగంలో మాత్రం భారత ఆర్చర్లు నిరాశ పరిచారు. పురుషుల విభాగంలో జయంత తాలుక్‌దార్ క్వార్టర్ ఫైనల్లో, అతాను దాస్ నాలుగో రౌండ్‌లో నిష్ర్కమించారు. మహిళల విభాగంలో లక్ష్మీరాణి, దీపిక నాలుగో రౌండ్‌లో ఓడిపోయారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top