
‘పసిడి’ ద్రాక్ష అందేనా!
ఘనమైన నేపథ్యం కలిగిన భారత పురుషుల హాకీ జట్టు దాదాపు అన్ని అంతర్జాతీయ మెగా ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది.
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత హాకీ జట్టు సత్తాకు పరీక్ష
సాక్షి క్రీడావిభాగం
ఘనమైన నేపథ్యం కలిగిన భారత పురుషుల హాకీ జట్టు దాదాపు అన్ని అంతర్జాతీయ మెగా ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. అయితే ఈ జాబితాలో ఇప్పటిదాకా కామన్వెల్త్ గేమ్స్ పసిడి పతకం మాత్రమే చేరలేదు. 84 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్రీడల్లో హాకీని తొలిసారి 1998లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన నాలుగు పర్యాయాల్లో భారత్ ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు చేరుకొని రజత పతకంతో సంతృప్తి పడింది.
క్రితంసారి 2010లో స్వదేశంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి ఫైనల్‌కు చేరిన భారత్ 0-8 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. హాకీ ఈవెంట్ మొదలైనప్పటి నుంచి చాంపియన్‌గా నిలుస్తోన్న ఆస్ట్రేలియా (1998, 2002, 2006, 2010)ను కంగారెత్తించి అందని ద్రాక్షగా ఉన్న పసిడిని సొంతం చేసుకోవాలంటే భారత బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. సర్దార్ సింగ్ నేతృత్వంలోని టీమిండియా సవాల్‌కు సిద్ధమై, స్వర్ణం సాధిస్తుందో లేక మళ్లీ రజతంతో సరిపెట్టుకుంటుందో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.
సెంటిమెంట్...
యాదృచ్ఛికమో మరేమిటోకానీ 1998 నుంచి 2010 వరకు ప్రతి కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియాను మినహాయిస్తే మరో జట్టు ఒక్కోసారి మాత్రమే ఫైనల్‌కు చేరింది. 1998లో మలేసియా, 2002లో న్యూజిలాండ్, 2006లో పాకిస్థాన్, 2010లో భారత్ ఫైనల్లోకి ప్రవేశించి రన్నరప్‌గా నిలిచాయి. ఈ సెంటిమెంట్ నేపథ్యంలో భారత్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంటుందో లేదో వేచి చూడాలి.
‘డ్రా’ అనుకూలం...
జాతీయ ఒలింపిక్ సంఘంలో వివాదాల కారణంగా ఈసారి పాకిస్థాన్ హాకీ జట్టు కామన్వెల్త్ గేమ్స్‌కు దూరంగా ఉంది. దాంతో భారత జట్టుకు ‘డ్రా’ అనుకూలమైంది. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను మినహాయిస్తే... దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్, వేల్స్ జట్లపై భారత్ నుంచి భారీ విజయాలు ఆశించవచ్చు. ఇక గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, మలేసియా, కెనడా, ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్, మలేసియాలలో రెండు జట్లు సెమీఫైనల్‌కు చేరుకోవడం ఖాయం. సెంటిమెంట్‌ను పక్కనబెడితే... స్థాయికి తగ్గట్టు ఆడితే భారత్ స్వర్ణ పతక పోరుకు అర్హత సాధిస్తుందనడంలో సందేహంలేదు.
సమతూకంతో జట్టు
ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన కనబరిచినా చివరి నిమిషాల్లో గోల్స్ సమర్పించుకొని భారత్ మూల్యం చెల్లించుకుంది. అయితే కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా భారత బృందం పట్టుదలతో ఉంది. గోల్‌కీపర్ శ్రీజేష్ అద్భుత విన్యాసాలు, మిడ్‌ఫీల్డ్‌లో సర్దార్ సింగ్ అప్రమత్తత... ‘స్టార్ డ్రాగ్ ఫ్లికర్స్’ రఘునాథ్, రూపిందర్‌పాల్ సింగ్ గురితప్పని షాట్‌లు... ఫార్వర్డ్ శ్రేణిలో గుర్విందర్ సింగ్ చాంది, డానిష్ ముజ్తబాల చేరికతో భారత్ సమతూకంతో కనిపిస్తోంది.
మహిళల జట్టుపై ఆశలు
భారత పురుషుల జట్టుతో సాధ్యంకానిది మహిళల జట్టు 2002లోనే చేసి చూపించింది. మాంచెస్టర్‌లో జరిగిన ఈ గేమ్స్‌లో భారత్ స్వర్ణ పతకాన్ని సాధించి సంచలనం సృష్టించింది. 2006 మెల్‌బోర్న్ గేమ్స్‌లో రజతం నెగ్గింది. అయితే 2010 ఢిల్లీ గేమ్స్‌లో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి భారత మహిళల జట్టు నుంచి కనీసం కాంస్యం ఆశించవచ్చు. లీగ్ దశలో న్యూజిలాండ్ లేదా దక్షిణాఫ్రికాలపై నెగ్గితే భారత్‌కు సెమీఫైనల్ చేరే అవకాశముంది.
భారత మ్యాచ్‌ల షెడ్యూల్
పురుషుల విభాగం
జూలై 25: వేల్స్‌తో; జూలై 26: స్కాట్లాండ్‌తో; జూలై 29: ఆస్ట్రేలియాతో; జూలై 31: దక్షిణాఫ్రికాతో.
మహిళల విభాగం
జూలై 24: కెనడాతో; జూలై 27: న్యూజిలాండ్‌తో; జూలై 28: ట్రినిడాడ్ అండ్ టొబాగోతో; జూలై 30: దక్షిణాఫ్రికాతో.