భారత రైల్వేస్‌ జట్టుకు టైటిల్‌ 

Indian Railways Team Got World Railways Tennis Title - Sakshi

ప్రపంచ రైల్వేస్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: యూఎస్‌ఐసీ ప్రపంచ రైల్వేస్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. బల్గేరియాలోని అల్బీనా వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత్‌ తన టైటిల్‌ను నిలబెట్టుకుంది. 10 దేశాలు పాల్గొన్న ఈ టోర్నీలో.... తెలంగాణ క్రీడాకారుడు పీసీ విఘ్నేశ్, నితిన్‌ కుమార్‌ సిన్హా (కోల్‌కతా), మొహమ్మద్‌ ఫహాద్, పృథ్వీ శేఖర్‌ (చెన్నై) సభ్యులుగా ఉన్న భారత బృందం విజేతగా నిలిచింది. 2015 జర్మనీలో జరిగిన టోర్నీలోనూ విఘ్నేశ్‌ సభ్యుడిగా ఉన్న భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన సూపర్‌ లీగ్‌ ఫైనల్లో భారత్‌ 4–0తో చెక్‌ రిపబ్లిక్‌పై గెలుపొందింది.

తొలి సింగిల్స్‌లో నితిన్‌ 6–4, 6–4తో సెరాఫిమ్‌ గ్రోజెవ్‌పై నెగ్గగా... రెండో సింగిల్స్‌ మ్యాచ్‌లో ఫహాద్‌ 6–0, 6–1తో క్రాసిమిర్‌ స్టోయ్‌కోవ్‌ను ఓడించాడు. మూడో మ్యాచ్‌లో విఘ్నేశ్‌ 1–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో హ్రిస్టో బోయనోవ్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. చివరి మ్యాచ్‌లో పృథ్వీ శేఖర్‌ 6–2, 6–2తో రాడోమిర్‌ టొనెవ్‌ను ఓడించి భారత్‌ విజయాన్ని పరిపూర్ణం చేశాడు. అంతకుముందు లీగ్‌ దశలో స్లోవేకియా, చెక్‌ రిపబ్లిక్‌లపై గెలుపొంది భారత్‌ ఎలిమినేషన్‌ రౌండ్‌కు అర్హత పొందింది. ఎలిమినేషన్‌ రౌండ్‌లో బెల్జియంపై నెగ్గి భారత్‌ సూపర్‌ లీగ్‌ దశకు చేరుకుంది. మూడు జట్లు తలపడిన ఈ సూపర్‌ లీగ్‌ పోరులో టీమిండియా ముందుగా బల్గేరియాపై, అనంతరం చెక్‌ రిపబ్లిక్‌పై విజయం సాధించి వరుసగా రెండోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top