కల్పన పునరాగమనం

India squad for the one-day series against England - Sakshi

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టులో ఎంపిక

ముంబై: స్వదేశంలో ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో జరిగే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల క్రికెట్‌ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యుల భారత బృందానికి హైదరాబాద్‌ సీనియర్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి రావి కల్పన మూడేళ్ల విరామం తర్వాత జాతీయ జట్టులో పునరాగమనం చేయనుంది. విజయవాడకు చెందిన కల్పన రెండో వికెట్‌ కీపర్‌గా జట్టులోకి ఎంపికైంది. 22 ఏళ్ల కల్పన... 2015 జూన్‌లో బెంగళూరులో న్యూజిలాండ్‌పై అరంగేట్రం చేసింది. ఆ తర్వాత మరో ఆరు వన్డేలు ఆడింది. 2016 ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌ తర్వాత ఆమె జట్టులో స్థానం కోల్పోయింది. భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో ఫిబ్రవరి 22, 25, 28 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. అంతకుముందు ఫిబ్రవరి 18న బోర్డు ప్రెసిండెట్స్‌ ఎలెవన్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య వార్మప్‌ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. బోర్డు ప్రెసిండెట్స్‌ జట్టులో రావి కల్పనతోపాటు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన సబ్బినేని మేఘన ఎంపికయ్యారు.  

భారత మహిళల వన్డే జట్టు: మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), జులన్‌ గోస్వామి, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్‌ కౌర్, దీప్తి శర్మ, తానియా భాటియా (వికెట్‌ కీపర్‌), రావి కల్పన (వికెట్‌ కీపర్‌), మోనా మేశ్రమ్, ఏక్తా బిష్త్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్‌ యాదవ్, శిఖా పాండే, మాన్సి జోషి, పూనమ్‌ రౌత్‌.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top