
మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్ విజయానికి 5 వికెట్ల దూరంలో ఉంది. కోహ్లిసేన సెకండ్ ఇన్నింగ్స్‌ను 106/8 వద్ద డిక్లేర్డ్ చేయడంతో 399 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు అదే తడబాటును కొనసాగించింది. నాలుగో రోజు ఆట టీ విరామ సమయానికి ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. అరోన్ ఫించ్ (3), మార్కస్ హర్రీస్ (13) మరోసారి విఫలం కాగా.. ఉస్మాన్ ఖాజా (33), షాన్ మార్ష్(44)లు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ షమీ, బుమ్రాలు వీరిని ఔట్ చేసి దెబ్బకొట్టారు. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్ (29), టిమ్ పైన్(1)లు పోరాడుతున్నారు. భారత బౌలర్ల దాటికి తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే కుప్పకూలిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆ దిశగానే పయనిస్తోంది. బుమ్రా, జడేజాలు రెండేసి వికెట్లు తీయగా.. షమీ ఒక వికెట్ తీశాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్ 443/7 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్ 106/8 డిక్లేర్డ్
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 151 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 138/5 (టీ విరామ సమయానికి)