శాంసన్‌కు నో ఛాన్స్‌.. శశిథరూర్‌ ట్వీట్‌ | IND VS WI 2nd T20: Shashi Tharoor is Unhappy with Samson Absence | Sakshi
Sakshi News home page

శాంసన్‌కు నో ఛాన్స్‌.. శశిథరూర్‌ ట్వీట్‌

Dec 10 2019 9:19 PM | Updated on Dec 10 2019 9:40 PM

IND VS WI 2nd T20: Shashi Tharoor is Unhappy with Samson Absence - Sakshi

టీమిండియా వెంటే ఉంటున్నాడు.. కానీ టీమిండియాలో ఉండటం లేదు.

హైదరాబాద్‌: సంజూ శాంసన్‌ గత కొంత కాలంగా టీమిండియా అభిమానుల నోళ్లలో నానుతున్న పేరు.  గత కొన్ని సిరీస్‌లుగా ఈ కేరళ క్రికెటర్‌ టీమిండియాతో ప్రయాణిస్తున్నప్పటికీ తుది జట్టులో మాత్రం ఉండటం లేదు. రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ వరుసగా విఫలమవుతున్నప్పటికీ టీమ్‌మేనేజ్‌మెంట్‌ మాత్రం అతడికే పదేపదే అవకాశాలు ఇస్తోంది. దీంతో శాంసన్‌తో పాటు అతడి అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. 

కనీసం ఒక్క మ్యాచ్‌ అయినా అవకాశం ఇస్తే శాంసన్‌ ప్రతిభ ఏంటో తెలుస్తుంది కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే శాంసన్‌ను కాదని పంత్‌ను తీసుకోవడంపై మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో పంత్‌ విఫలమవ్వడంతో.. తిరువనంతపురం వేదికగా జరిగే మ్యాచ్‌లో స్థానిక క్రికెటర్‌ శాంసన్‌కు అవకాశం ఇస్తారని అందరూ భావించారు. అయితే తుది జట్టులో శాంసన్‌ పేరు లేకపోవడంతో అతడి అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. 

అయితే ఈ కేరళ క్రికెటర్‌ను ఆడించకపోవడంపై అభిమానులతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ పెదవి విరిచారు. ‘శాంసన్‌ను తన సొంత మైదానంలో టీమిండియా తరుపున ఆడించే అవకాశం ఇస్తారని భావించాము. కానీ నిరాశే ఎదురైంది. శాంసన్‌కు ఉన్న అత్యంత ధైర్య సాహసాలు, ఓపికకు మేమందరం ఏంతో ప్రేరణ పొందుతున్నాం’ అంటూ ట్వీట్‌ చేశారు. మ్యాచ్‌ సందర్భంగా కూడా మైదానంలో శాంసన్‌.. శాంసన్‌ అంటూ లోకల్‌ ఫ్యాన్స్‌ గట్టిగా అరిచిన విషయం తెలిసిందే. 

ఇక బంగ్లాదేశ్‌ సిరీస్‌ ముగిశాక కూడా శాంసన్‌ను ఆడించకపోవడంపై ఈ కాంగ్రెస్‌ నేత తప్పుబట్టారు. ‘అవకాశం ఇవ్వకుండా సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడం నన్ను తీవ్రంగా నిరాశకు గురి చేసింది. కనీసం అవకాశం కూడా ఇవ్వడం లేదు. మూడు టీ20ల సిరిస్‌లో డ్రింక్స్‌ ఇవ్వడం వరకే పరిమితం చేశారు. తుది జట్టులో అవకాశం ఇవ్వకుండా విస్మరించారు. అతడి బ్యాటింగ్‌ను పరీక్షించాలనుకుంటున్నారా లేక అతని హృదయాన్నా?’అంటూ శశిథరూర్‌ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement