రాస్‌ టేలర్‌కు ‘వంద’నం

IND Vs NZ: Ross Taylor Plays 100th T20I - Sakshi

మౌంట్‌మాంగనీ:  న్యూజిలాండ్‌ వెటరన్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆదివారం టీమిండియాతో జరుగుతున్న చివరిదైన ఐదో టీ20 మ్యాచ్‌ టేలర్‌ కెరీర్‌లో వందో అంతర్జాతీయ టీ20. ఫలితంగా ఈ ఫీట్‌ సాధించిన తొలి కివీస్‌ ఆటగాడిగా రాస్‌ టేలర్‌ ఘనత సాధించాడు.  సుదీర్ఘ కాలంగా క్రికెట్‌ను ఆస్వాదిస్తున్న రాస్‌ టేలర్‌ ఒకప్పుడు హిట్టింగ్‌కు పెట్టింది పేరు. 

కాగా, ఇటీవల కాలంలో రాస్‌ టేలర్‌ ప్రాభవం తగ్గింది. ఒక సీనియర్‌ క్రికెటర్‌ కావడంతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో 15వేలకు పైగా పరుగుల్ని టేలర్‌ నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో టేలర్‌ ఇప్పటివరకూ 1,856 పరుగులు చేశాడు. టీ20ల్లో టేలర్‌ స్టైక్‌రేట్‌ 123.00 ఉండగా, యావరేజ్‌ మాత్రం 25.42గానే ఉంది. వన్డే ఫార్మాట్‌లో టేలర్‌ 8,371 పరుగులు సాధించగా, టెస్టుల్లో 7,175 పరుగులు చేశాడు. (ఇక్కడ చదవండి: శాంసన్‌ మళ్లీ మిస్‌ చేసుకున్నాడు..!)

భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో టేలర్‌ తన వందో టెస్టు ఆడే అవకాశం ఉంది.  అదే జరిగితే మూడు ఫార్మాట్లలో వంద మ్యాచ్‌లు ఆడిన ఏకైక ప్లేయర్‌గా టేలర్‌ కొత్త రికార్డు నెలకొల్పుతాడు. 228 వన్డేలు ఆడిన టేలర్‌.. 99 టెస్టులు మాత్రమే ఆడాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మూడో క్రికెటర్‌గా టేలర్‌ ఉన్నాడు. ఈ జాబితాలో షోయబ్‌  మాలిక్‌(113), రోహిత్‌ శర్మ(107)ల తర్వాత స్థానంలో టేలర్‌ కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంచితే, ఇక న్యూజిలాండ్‌ తరఫున వందో టెస్టు ఆడిన తొలి ఆటగాడు స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ కాగా, ఆ జట్టు తరఫున వందో వన్డే ఆడిన మొదటి ఆటగాడు రిచర్డ్‌ హ్యాడ్లీ. కాగా, ఇప్పుడు కివీస​ తరఫున వందో టీ20 ఆడుతున్న తొలి ఆటగాడిగా టేలర్‌ నిలవడం విశేషం. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top