
బరిలో సచిన్, ద్రవిడ్
సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ చివరిసారిగా రంగు దుస్తుల్లో క్రికెట్ ఆడుతుంటే చూడటానికి అభిమానులకు ఆఖరి అవకాశం. సెప్టెంబరు 17 నుంచి జరిగే చాంపియన్స్‌లీగ్ టి20లో ఈ ఇద్దరూ బరిలోకి దిగుతున్నారు.
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ చివరిసారిగా రంగు దుస్తుల్లో క్రికెట్ ఆడుతుంటే చూడటానికి అభిమానులకు ఆఖరి అవకాశం. సెప్టెంబరు 17 నుంచి జరిగే చాంపియన్స్‌లీగ్ టి20లో ఈ ఇద్దరూ బరిలోకి దిగుతున్నారు. లీగ్ బరిలోకి దిగే 12 జట్లు తమ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. రెండు జట్ల తరఫున చాంపియన్స్ లీగ్ ఆడే అవకాశం ఉన్న విదేశీ క్రికెటర్లు 12 మంది ఉంటే... ఇందులో 11 మంది ఐపీఎల్ జట్ల తరఫున ఆడాలని నిర్ణయించుకున్నారు.
వాట్సన్, హస్సీ, బ్రేవో, పొలార్డ్ ఈ జాబితాలో ఉన్నారు. శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర మాత్రం తమ దేశవాళీ జట్టు కుందురత తరఫునే ఆడనున్నాడు. సెప్టెంబరు 17న హైదరాబాద్‌లో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో టోర్నీకి తెరలేవనుంది. ఇందులో సన్‌రైజర్స్‌తో సహా నాలుగు జట్లు పోటీ పడతాయి. వీటిలోంచి రెండు జట్లు ప్రధాన పోటీలకు అర్హత సాధిస్తాయి. మిగిలిన 8 జట్లతో ఈ రెండింటిని కలిపి... మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించి లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అక్టోబరు 6న ఢిల్లీలో టోర్నీ ఫైనల్ జరుగుతుంది.
వీసా కోసం పాక్ జట్టు దరఖాస్తు
చాంపియన్స్ లీగ్ టి20లో ఆడే ఫైసలాబాద్ జట్టు క్రికెటర్ల వీసా కోసం పాక్ క్రికెబ్ బోర్డు భారత్‌కు దరఖాస్తు చేసింది. అయితే సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఫైసలాబాద్ వోల్వ్స్‌ను అనుమతించే విషయమై ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ‘ఫైసలాబాద్ జట్టు విషయమై భారత క్రికెట్ బోర్డును మేం నిరంతరం సంప్రదిస్తూనే ఉన్నాం. అయితే వారు ప్రభుత్వం నుంచి వచ్చే తుది నిర్ణయం కోసం వేచి ఉన్నామని చెప్పారు. కానీ మా జట్టును భారత్ పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచించారు’ అని పీసీబీ వర్గాలు తెలిపాయి.
‘నా విధేయతను ఎవరూ ప్రశ్నించలేరు’
చాంపియన్స్ లీగ్ టి20లో తమ సొంత జట్టు తరఫున ఆడేందుకు నిర్ణయించుకున్న కుమార సంగక్కర దేశం పట్ల తనకున్న విధేయతను ప్రశ్నించిన శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులను విమర్శించాడు. సీఎల్ టి20లో ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్, లంక నుంచి కుందురత మరూన్ కూడా అర్హత సాధించడంతో సంగ తన సొంత జట్టుకే ఆడాలని భావించాడు. ‘సీఎల్ టి20కి కుందురత అర్హత సాధించడంతోనే నేను ఆ జట్టుకే ఆడాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే ఐపీఎల్ టీమ్ నన్ను వదులుకునేందుకు మొదట్లో సిద్ధపడలేదు. అసలు కుందురత తరఫున నేను ఆడాలని వారు నేరుగా చెప్పడం గత మంగళవారమే విన్నాను. ఐపీఎల్ ఫ్రాంచైజీతో వారు మాట్లాడితే బావుండేది. శ్రీలంక క్రికెట్ ఆ విషయంలో విఫలమైంది. అందుకే నేనే తగిన నిర్ణయం తీసుకున్నాను’ అని సంగక్కర చెప్పాడు. సన్‌రైజర్స్‌కు దూరమైనందుకు సంగ లక్షా 40 వేల డాలర్లు కోల్పోనున్నాడు.