
మాంచెస్టర్: వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్ నుంచే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన నాకౌట్ సమరంలో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా-ఎంఎస్ ధోనిల ద్వయం హాఫ్ సెంచరీలతో ఆదుకునే యత్నం చేసినా చివరకు పరాజయం తప్పలేదు. వీరిద్దరూ పోరాట స్ఫూర్తితో భారత్ ఓ దశలో గెలుపు అంచుల వరకూ వెళ్లింది. అయితే ఈ జోడి స్కోరును పెంచే క్రమంలో ఔట్ కావడంతో భారత్ మెగా టోర్నీ నుంచి వైదొలిగింది. ఈ వరల్డ్‌కప్ ఆద్యంతం ధోనిపై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. అతని స్లో స్టైక్‌రేట్‌తో విమర్శల పాలయ్యాడు ధోని. నిన్నటి మ్యాచ్‌లో ధోని విలువైన పరుగులు సాధించినా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.
దీనిపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు. ‘ ధోని ఒక వరల్డ్‌క్లాస్ క్రికెటర్ అనడంలో సందేహం లేదు. అతనిపై ఇటీవల కాలంలో వస్తున్న విమర్శలు బాధాకరం. ధోని తన పౌరసత్వాన్ని మార్చుకుంటే అతన్ని తీసుకోవాలంటూ మా సెలక్షన్ కమిటీకి సిఫారుసు చేస్తాం. ప్రస్తుతం మాతో కలిసి ధోని ఆడే అవకాశం లేదు. ధోని మాతో కలిసి ఆడాలనకుంటే పౌరసత్వాన్ని మార్చుకోవాలి’ అని సరదాగా వ్యాఖ్యానించాడు.
విలియమ్సన్ చేసిన వ్యాఖ్యలు సరదాగా చేసినవే అయినప్పటికీ, ధోనిపై ఉన్న అభిమానాన్ని చాటుతున్నాయి. గతంలో కూడా ధోనిపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశాడు. ధోని వీల్‌చైర్‌లో ఉన్నా తన జట్టులో చోటు ఉంటుందని వ్యాఖ్యానించాడు. అతనొక అసాధారణ ఆటగాడని, తన ఎలెవన్ జట్టులో ధోనికి ఎప్పుడూ చోటు ఉంటుందని తెలిపాడు.