కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో షమీ..

ICC rankings: Shami Breaks Into Top 10 - Sakshi

దుబాయ్‌: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఏడు వికెట్లతో చెలరేగిన టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ తన ర్యాంకింగ్స్‌లో కూడా దూసుకొచ్చాడు. తొలిసారి తన కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకును నమోదు చేశాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) విడుదల చేసిన ఆటగాళ్ల టెస్టు ర్యాంకింగ్స్‌లో షమీ 7వ స్థానానికి ఎగబాకాడు. ఇది షమీకి టెస్టుల్లో అత్యుత్తమ ర్యాంక్‌. కాగా, టెస్టు ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకునే క‍్రమంలో షమీ 790 రేటింగ్‌ పాయింట్లు సాధించాడు. ఫలితంగా భారత్‌ తరఫున టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక రేటింగ్‌ పాయింట్లు నమోదు చేసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. షమీ కంటే ముందు కపిల్‌దేవ్‌(877), జస్‌ప్రీత్‌ బుమ్రా(832)లు ఉన్నారు.

ఇక షమీ, రవిచంద్రన్‌ అశ్విన్‌, టాప్‌ 10 బౌలర్లలో స్థానం సంపాదించుకోగా ఇషాంత్‌ శర్మ టాప్‌ 20లో పాగా వేశాడు. కాగా ఇండోర్‌లో జరిగిన టెస్ట్‌ క్రికెట్‌లో భారత్‌ బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన సంగతి తెలిసిందే. భారత విజయంలో ఫాస్ట్‌ బౌలర్‌ షమీ కీలకంగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌ తర్వాత షమీకి అదనపు పాయింట్లు తోడయ్యాయి. ప్రస్తుతం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 790 పాయింట్లతో ఏకంగా పదిహేను స్థానాలు ఎగబాకి ఏడోస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

మరొకవైపు బ్యాటింగ్‌ విభాగంలో 691 పాయింట్లతో మయాంక్‌ అగర్వాల్‌ 11వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇది మాయంక్‌కు టెస్టుల్లో బెస్ట్‌ ర్యాంకు. భారత ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టాప్‌ 10 బౌలర్లలో చోటు దక్కించుకోగా ఆల్‌రౌండర్స్‌ కేటగిరీలో ఓ స్థానం దిగజార్చుకుని నాలుగో ర్యాంకుకు పరిమితమయ్యాడు.. కాగా వరుస విజయాలతో దూకుడుగా ఉన్న టీమిండియా.. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో 300 పాయింట్లతో ఆధిక్యాన్ని నిలబెట్టకుంది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌ 120 పాయింట్లు సాధించగా, దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను సైతం వైట్‌వాష్‌ చేయడంతో 120 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత బంగ్లాతో తొలి టెస్టులో విజయం సాధించడం ద్వారా 60 పాయింట్లు నమోదు చేసింది. దాంతో 300 పాయింట్ల మార్కును చేరింది. ఆ తర్వాత స్థానంలో న్యూజిలాండ్‌, శ్రీలంకలు సంయుక్తంగా రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు తర్వాత స్థానాల్లో నిలిచాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top