లారా సరసన హోల్డర్‌

Holders Double Century Puts Windies In Total Control vs England - Sakshi

డబుల్‌ సెంచరీతో మెరిసిన విండీస్‌ కెప్టెన్‌

బ్రిడ్జ్‌టౌన్‌: వెస్టిండీస్‌ టెస్టు కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో హోల్డర్‌(202 నాటౌట్‌; 229 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయంగా ద్విశతకం నమోదు చేశాడు. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్న హోల్డర్‌ తన టెస్టు కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. అతనికి జతగా షేన్‌ డొవ్రిచ్‌(116 నాటౌట్‌; 224 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌) సెంచరీ సాధించాడు. ఫలితంగా వెస్టిండీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను 415/6 వద్ద డిక్లేర్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగుల వద్దే విండీస్‌ ఆరో వికెట్‌ నష్టపోయినా హోల్డర్‌-డొవ్రిచ్‌ల జోడి భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింంది.

ఆ తర్వాత రెండో ఇన‍్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 572 పరుగులు వెనుకబడి ఉంది. వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 289 పరుగులు చేయగా, ఇంగ్లండ్‌ 77 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హోల్డర్‌ అరుదైన రికార్డును నెలకొల్పాడు. టెస్టు చరిత్రలో ఇంగ్లండ్‌ సాధించిన స్కోరు కంటే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో విండీస్‌ కెప్టెన్‌గా హోల్డర్‌ నిలిచాడు. గతంలో బ్రియాన్‌ లారా(400 నాటౌట్‌) క్వాడ్రాపుల్‌ సెంచరీ సాధించగా, ఇంగ్లండ్‌ 285 పరుగులకు ఆలౌటైంది. 2004లో సెయింట్‌జోన్స్‌లో జరిగిన టెస్టులో లారా ఆ ఫీట్‌ను సాధించిన కెప్టెన్‌ కాగా, ఆ తర్వాత ఇంతకాలానికి ఆ ఘనత సాధించిన విండీస్‌ కెప్టెన్‌గా హోల్డర్‌ నిలిచాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top