దొంగగా మారిన మాజీ అంపైర్‌ | Sakshi
Sakshi News home page

దొంగగా మారిన మాజీ అంపైర్‌

Published Tue, Oct 24 2017 11:56 PM

Former umpire Darrell Hair was caught stealing money

సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన వివాదాస్పద మాజీ అంపైర్‌ డారెల్‌ హెయిర్‌ నగదు దొంగిలిస్తూ పట్టుబడ్డారు. 65 ఏళ్ల హెయిర్‌ తాను పనిచేస్తున్న మద్యం దుకాణంలో రూ. 4.50 లక్షలు (9,005 ఆస్ట్రేలియా డాలర్లు) దొంగిలించారు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఆయన దొరికిపోవడంతో స్థానిక కోర్టులో హాజరు పరిచారు. ఇది క్రిమినల్‌ నేరం కాకపోవడం... హెయిర్‌ తాను దొంగిలించిన డబ్బును చెల్లించడంతో ఆయనకు కోర్టు 18 నెలలు సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. 1992 నుంచి 2008 వరకు ఆయన 78 టెస్టులకు అంపైర్‌గా వ్యవహరించారు. అయితే మైదానంలో ఆయన తీసుకున్న నిర్ణయాలతో వివాదాస్పద అంపైర్‌గా గుర్తింపు పొందారు.

ముఖ్యంగా 1995లో లంక స్టార్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ను తప్పుబడుతూ వరుసగా నోబాల్స్‌ ఇవ్వడం వివాదంగా మారింది. ఆ తర్వాత ఐసీసీ మురళీకి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో పాకిస్తాన్‌ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిందని క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారిగా ఐదు పరుగుల పెనాల్టీ విధించడం కూడా వివాదాస్పదమైంది.  

Advertisement
Advertisement