తొలి గెలుపే మలుపు

First ODI against South Africa in Durban today - Sakshi

డర్బన్‌లో నేడు దక్షిణాఫ్రికాతో మొదటి వన్డే

సాయంత్రం 4.30 నుంచి సోనీ టెన్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

భారత్‌... పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చాలా  బలమైన జట్టై ఉండొచ్చు. రెండు ప్రపంచ కప్‌లూ గెలిచి ఉండొచ్చు. కొన్నిసార్లు విదేశాల్లో ముక్కోణపు సిరీస్‌లలో జయకేతనం ఎగురేసి ఉండొచ్చు. 
దక్షిణాఫ్రికా... ఐసీసీ టోర్నీల్లో తడబడి ఉండొచ్చు. ప్రపంచకప్‌లు సాధించి ఉండకపోవచ్చు. కానీ, సొంతగడ్డపై వారిని వన్డేల్లో ఓడించడం బహు కష్టం. మిగతా జట్ల కంటే టీమిండియాకు ఇది బాగా అనుభవం. 

డర్బన్‌: పరిస్థితులు కలిసొస్తే దక్షిణాఫ్రికాలో భారత జట్టు టెస్టు సిరీస్‌నైనా గెలవొచ్చేమో కాని, వన్డేల్లో మరీ ముఖ్యంగా ద్వైపాక్షిక సిరీస్‌ను నెగ్గడమంటే అద్భుతంగా రాణించినట్లే. నాలుగు పర్యటనల్లో కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచిన చరిత్ర దీనికి నిదర్శనం. రెండు ముక్కోణపు సిరీస్‌ల లోనూ మనకు చేదు అనుభవాలే మిగిలాయి. 8 వన్డేల్లో ఒక్కటంటే ఒక్కసారే ప్రత్యర్థిని ఓడించగలిగాం. ఇలాంటి రికార్డుల మధ్య ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం సఫారీలతో డర్బన్‌లో మొదటి మ్యాచ్‌ జరుగనుంది. బలాబలాల రీత్యా అన్ని విభాగాల్లో రెండు జట్లూ సమానంగా కనిపిస్తున్నా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఒకటి రెండు మెరుపు ప్రదర్శనలే మ్యాచ్‌ ఫలితాన్ని నిర్దేశిస్తాయి. ప్రత్యర్థి జట్టులో 9వ నంబరు వరకు బ్యాటింగ్‌ చేయగల వారున్నందున భారీ స్కోరు చేయకుండా అడ్డుకోవడం మన బౌలర్ల ప్రధాన బాధ్యత కానుంది. ఒకవేళ తొలుత భారత్‌ బ్యాటింగ్‌ చేసినా భారీ లక్ష్యాన్ని నిర్దేశించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చివరి టెస్టు పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ... అందని ద్రాక్షలా ఊరిస్తున్న వన్డే సిరీస్‌ను ఖాతాలో వేసుకోవాలంటే విరాట్‌ కోహ్లి సేన తొలి మ్యాచ్‌లోనే గెలిచి మానసికంగా పైచేయి సాధించాలి. 

నాలుగులో రహానే..? 
ఎప్పటిలాగే తుది జట్టు ఎంపిక పరంగా టీమిండియాకు కొంత సంక్లిష్టత ఎదురుకానుంది. ఓపెనర్లుగా రోహిత్, ధావన్, వన్‌డౌన్‌లో కోహ్లి ఖాయం. నమ్మదగిన బ్యాట్స్‌మన్‌ అయిన అజింక్యా రహానే, మనీశ్‌పాండే పోటీలో ఉండటంతో ఎటుతిరిగి నాలుగో స్థానంపైనే చర్చ సాగుతోంది. వీరిలో ఒకరికే అవకాశం ఉంటుంది. లంకతో సిరీస్‌లో రాణించిన శ్రేయస్‌ అయ్యర్, దినేశ్‌ కార్తీక్‌ బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. స్పిన్‌  వేయగలడు కాబట్టి అయిదో నంబరులో కేదార్‌ జాదవ్‌కు ఢోకా లేనట్లే. ఆరు, ఏడు స్థానాలు ధోని, హార్దిక్‌ పాండ్యాలివి. పిచ్‌ పరిస్థితుల రీత్యా ఒక్కరే స్పిన్నర్‌ను ఆడిస్తే వైవిధ్యం చూపే కుల్దీప్‌యాదవ్‌ వైపు మొగ్గు ఉంటుంది. కానీ భువనేశ్వర్‌ బ్యాటింగ్‌లోనూ మెరుగవడం, పేస్‌ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ ఉన్నందున మూడో పేసర్‌ బదులు మణికట్టు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌కు చోటిచ్చినా ఆశ్చర్యం లేదు. 

డివిలియర్స్‌ స్థానంలో మార్క్‌రమ్‌ 
డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ డివిలియర్స్‌ గాయంతో దూరమైనందున డుప్లెసిస్‌ నేతృత్వంలోని ఆతిథ్య జట్టుకు బ్యాటింగ్‌లో పెద్ద లోటు ఏర్పడింది. అందుకని కొత్తవారి బదులు టెస్టుల్లో సత్తా చాటిన మార్క్‌రమ్‌ను ఏబీ బదులుగా ఆడించనున్నారు. డిపెండబుల్‌ ఆమ్లా, కీపర్‌ డికాక్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తారు. వీరికితోడుగా మిల్లర్, డుమిని వంటి ప్రమాదకర ఆటగాళ్లు భారత్‌కు సవాల్‌ విసరడానికి సిద్ధమవుతున్నారు. స్పిన్నర్‌గా ఇమ్రాన్‌ తాహిర్‌ వైపే మొగ్గు చూపొచ్చు. ప్రధాన పేసర్లు రబడ, మోర్కెల్‌తో పాటు ఆల్‌రౌండర్లుగా ఫెలూక్వాయో, క్రిస్‌ మోరిస్‌ ఉంటారు.  

తుది జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్‌), రహానే/పాండే, కేదార్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, షమీ, బుమ్రా 
దక్షిణాఫ్రికా: ఆమ్లా, డికాక్, డుప్లెసిస్‌ (కెప్టెన్‌), మార్క్‌రమ్, మిల్లర్, డుమిని, మోరిస్, ఫెలూక్వాయో, మోర్కెల్, రబడ, ఇమ్రాన్‌ తాహీర్‌.

102 పరుగులు చేస్తే వన్డేల్లో  ధోని  10 వేల పరుగులు పూర్తవుతాయి.

దక్షిణాఫ్రికా గడ్డపై  ఆ జట్టుతో భారత్‌ ఆడిన 28 వన్డేల్లో  5 గెలిచి 21 ఓడింది.  2 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇరుజట్ల మధ్య జరిగిన ఆఖరి వన్డే సిరీస్‌లో (భారత్‌లో) టీమిండియా  2–3తో ఓడింది.

‘ఇప్పటివరకు నాలుగో స్థానంపై పలు ప్రయోగాలు చేశాం. అక్కడ బలపడితే జట్టు మరింత సమతూకంగా మారుతుంది. మా స్పిన్నర్లు విదేశాల్లో తొలిసారి ఆడుతున్నారు. వారికిది కఠిన పరీక్ష. డర్బన్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది.  పరిస్థితులకు ఎవరైతే సరిపోతారో వారినే తీసుకోవాలనేది మా ఉద్దేశం. జట్టుకు అవసరమైన సందర్భంలో చేసిన 40 పరుగులే గొప్ప. ప్రపంచ కప్‌లోగా అందరినీ పరీక్షిస్తాం. రహానే ఓపెనరే అయినా గత ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో ఆడాడు. ఇంగ్లండ్‌ పరిస్థితుల్లో అతడు ఈ స్థానానికి గట్టి పోటీదారు. అయ్యర్, పాండే సహా అందరికీ అవకాశాలున్నాయి’  
– కోహ్లి 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top