జిల్‌ జిల్‌ బ్రెజిల్‌

Fifa World Cup 2018 : brazil beats Mexico - Sakshi

మెక్సికో ఆట ముగిసింది 

 2–0తో బ్రెజిల్‌ జయభేరి 

క్వార్టర్స్‌లో ప్రవేశం 

జర్మనీ లీగ్‌ దశలోనే ఇంటికెళ్లింది. నాకౌట్‌ మొదలైన రోజే అర్జెంటీనా ఓడింది. పోర్చుగల్‌ కథ ముగిసింది. స్పెయిన్‌ షూటౌటైంది. ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ఈ జట్లన్నీ ఒక్కొక్కటిగా నిష్క్రమించాయి. కానీ మరో ఫేవరెట్‌ బ్రెజిల్‌ మాత్రం ఆ హోదాకు న్యాయం చేసింది. ప్రిక్వార్టర్స్‌లో మెక్సికోపై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. అలాగని మెక్సికో అంత తేలిగ్గా తలవంచలేదు. బ్రెజిల్‌ దాడుల్ని ఎక్కడికక్కడ నిలువరించింది. అయితే ఐదుసార్లు చాంపియన్‌కు పోటీగా మెక్సికో గోల్స్‌ చేయడంలో విఫలమై... మళ్లీ ప్రిక్వార్టర్స్‌తోనే సరిపెట్టుకుంది.  

సమారా: బ్రెజిల్‌ తన స్థాయికి తగ్గ ఆటతీరుతో సత్తా చాటింది. సంచలనాన్ని ఆశించిన మెక్సికో కోరల్ని పీకేసింది. ఐదుసార్లు చాంపియన్‌ అయిన బ్రెజిల్‌ దర్జాగా ‘ఫిఫా’ ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫేవరెట్ల నాక్‌‘ఔట్‌’లకు తెరవేసింది. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బ్రెజిల్‌ 2–0తో మెక్సికోపై జయభేరి మోగించింది. స్టార్‌ స్ట్రయికర్‌ నెమార్, సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రాబెర్టో ఫర్మినో చెరో గోల్‌ చేసి బ్రెజిల్‌ విజయాన్ని ఖాయం చేశారు. రెండు అర్ధభాగాల్లోనూ మెక్సికో ఆటగాళ్లు చక్కటి పోరాటం కనబరిచారు. బంతిని అందిపుచ్చుకోవడంలో ప్రత్యర్థి కంటే చురుగ్గా కదిలారు. కానీ బ్రెజిల్‌ డిఫెన్స్‌ను ఛేదించలేక గోల్స్‌ చేయడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా తొలి అర్ధభాగంలో మెక్సికో ఒక్కసారి కూడా లక్ష్యంపై గురిపెట్టలేకపోయింది. ఇలా విఫలమవడం టోర్నీలో ఇదే మొదటిసారి. మరోవైపు బ్రెజిల్‌ అదేపనిగా తమ దాడులకు పదునుపెట్టింది. కానీ ప్రత్యర్థి గోల్‌ కీపర్‌ ఒచొవా పాదరసంలా స్పందించడంతో మొదటి అర్ధభాగంలో ఏ ఒక్కటీ గోల్‌ కాలేకపోయింది.

అయితే రెండో అర్ధభాగం మొదలైన ఆరు నిమిషాలకే నెమార్‌ (51వ ని.) ఈ బెంగ తీర్చాడు. పెనాల్టీ బాక్స్‌లో ఎడమవైపు నుంచి విలియన్‌ ఇచ్చిన పాస్‌ ఆపేందుకు ఒచొవా కాస్త ముందుకు డైవ్‌ చేశాడు. అతన్ని దాటుకుంటూ క్రాస్‌గా వెలుపలికి వెళుతున్న బంతిని గోల్‌పోస్ట్‌లోకి నెట్టేందుకు జీసెస్‌... అతని వెనకే నెమార్‌ ప్రయత్నించారు. జీసెస్‌ను దాటిన బంతి నెమార్‌ చొరవతో గోల్‌ అయింది. తర్వాత ఆట 86వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్‌ కౌటిన్హో స్థానంలో వచ్చిన ఫర్మినో (88వ ని.) రెండు నిమిషాలకే గోల్‌ చేసి బ్రెజిల్‌ ఆనందాన్ని రెట్టింపు చేశాడు. పాస్‌ల్లోనూ, బంతిని ఆధీనంలో ఉంచుకోవడంలోనూ మెక్సికో ఆటగాళ్లు ప్రత్యర్థులకు దీటుగా పోటీపడ్డారు. కానీ లక్ష్యంపై గురిపెట్టడంలోనే బాగా వెనకబడ్డారు. ఇదే ఈ మ్యాచ్‌లో తేడా. బ్రెజిల్‌ 20 షాట్లు ఆడింది. పది సార్లు గోల్‌పోస్ట్‌పై దాడి చేసింది. రెండుసార్లు సఫలమైంది. మెక్సికో షాట్లలో బ్రెజిల్‌ అంత కాకపోయినా... 14 షాట్లు ఆడింది. కానీ లక్ష్యంపై ఒక్కసారి మాత్రమే దూసుకొచ్చింది. దాన్ని గోల్‌గా మలచలేక పరాజయం పాలైంది. 

►7 1986 ప్రపంచ కప్‌ నుంచి నాకౌట్‌లో ప్రిక్వార్టర్స్‌ చేర్చారు. అప్పటి నుంచి అందరి కంటే ఎక్కువగా ఏడు సార్లు ఓడింది మెక్సికోనే! 

►6 ప్రపంచకప్‌ టోర్నీల్లో నెమార్‌ 6 గోల్స్‌ చేసేందుకు 38 షాట్లే ఆడాడు. ఆరేసి గోల్స్‌ సాధించేందుకు మెస్సీ (అర్జెంటీనా) 67 షాట్లు, రొనాల్డో (పోర్చుగల్‌) 74 షాట్లు ఆడారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top