
ప్రతి రోజూ ప్రేమికుల రోజే!
సినీ నటి అనుష్క శర్మతో తన అనుబంధం గురించి ప్రపంచమంతా తెలిసినా...
ముంబై: సినీ నటి అనుష్క శర్మతో తన అనుబంధం గురించి ప్రపంచమంతా తెలిసినా, ఇందులో దాపరికం ఏమీ లేదంటూ పరోక్షంగా చెప్పినా... విరాట్ కోహ్లి ఈ ప్రేమను ఎప్పుడూ బహిరంగంగా వ్యక్తపరచలేదు. అయితే అందుకోసం ఇప్పుడు ‘వాలెంటైన్స్ డే’ను అతను తగిన సమయంగా ఎంచుకున్నాడు. తాను, అనుష్క పార్క్లో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేసిన కోహ్లి... ‘నువ్వు అనుకుంటే ప్రతీ రోజూ ప్రేమికుల రోజే. ప్రతీ రోజు నాకు అలా అనిపించేలా నువ్వు చేశావు... అనుష్క శర్మ’ అంటూ వ్యాఖ్య జోడించాడు.
ఆ తర్వాత అతను దీనిని తన అకౌంట్ నుంచి తొలగించినా అప్పటికే ఫొటో, వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి. నాలుగేళ్ల క్రితం ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో తొలిసారి పరిచయమైన వీరిద్దరు, అప్పటి నుంచి తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల విరాట్, అనుష్క కలిసి డెహ్రాడూన్లో కొత్త సంవత్సర వేడుకలు కూడా జరుపుకున్నారు.