వరల్డ్‌కప్‌: శ్రీలంక ఢమాల్‌ | Disappointing Sri Lanka bowled out for 136 Against New Zealand | Sakshi
Sakshi News home page

వరల్డ్‌కప్‌: శ్రీలంక ఢమాల్‌

Jun 1 2019 5:32 PM | Updated on Jun 1 2019 5:47 PM

Disappointing Sri Lanka bowled out for 136 Against New Zealand - Sakshi

కార్డిఫ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో మరో స్వల్ప స్కోరు నమోదైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమై 136 పరుగులకే చాపచుట్టేసింది. న్యూజిలాండ్‌ బౌలింగ్‌ ధాటిగా ఎదురొడ్డి నిలవకలేక చేతులెత్తేసింది. లంక బ్యాటింగ్‌ లైనప్‌లో కెప్టెన్‌ దిముత​ కరుణరత్నే(52 నాటౌట్‌: 84 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ సాధించడం మినహా అంతా విఫలమయ్యారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో లంక ఇన్నింగ్స్‌ను తిరుమన్నే, కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నేలు ఆరంభించారు. అయితే ఇన్నింగ్స్‌ తొలి బంతిని ఫోర్‌ కొట్టి మంచి టచ్‌లో కనిపించిన తిరుమన్నే ఆపై తదుపరి బంతికే వికెట్‌ను చేజార్చుకున్నాడు. దాంతో లంక నాలుగు పరుగుల వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది. ఈ క్రమంలో కరుణరత్నేతో జత కలిసిన కుశాల్‌ పెరీరా ఇన్నింగ్స్‌ నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 42 పరుగులు జత చేసిన తర్వాత  పెరీరీ(29) భారీ షాట్‌కు యత్నించి ఔట్‌ కాగా, ఆ మరుసటి బంతికే కుశాల్‌ మెండిస్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఇక ధనుంజయ డిసిల్వా కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఫెర్గ్యుసన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు డిసిల్వా.  ఏంజెలో మాథ్యూస్‌ డకౌట్‌ కాగా, జీవన్‌ మెండిస్‌ పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. తిషారా పెరీరా(27) కాసేపు క్రీజ్‌లో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లు డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం. అసలు పరుగులు ఖాతా తెరువకుండా పెవిలియన్‌ చేరిన లంక ఆటగాళ్లలో కుశాల్‌ మెండిస్‌, ఏంజెలో మాథ్యూస్‌, ఇసురు ఉదానలు డకౌట్‌గా పెవిలియన్‌ చేరారు. దాంతో శ్రీలంక 29. 2 ఓవర్లలోనే ఇన్నింగ్స్‌ను ముగించింది.

మ్యాట్‌ హెన్రీ దెబ్బ
శ్రీలంక ఇన్నింగ్స్‌ను న్యూజిలాండ్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ కకావికలం చేశాడు. తొలి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకుని లంకను దెబ్బ కొట్టాడు.  తొలి ఓవర్‌ రెండో బంతికి లంక ఓపెనర్‌ లహిరు తిరుమన్నే(4)ను ఎల్బీగా పెవిలియన్‌కు పంపిన హెన్రీ.. తొమ్మిదో ఓవర్‌లో మరో రెండు వికెట్లు సాధించి శ్రీలంకకు షాకిచ్చాడు. తొమ్మిదో ఓవర్‌ మొదటి బంతికి కుశాల్‌ పెరీరా(29) ఔట్‌ చేసిన హెన్రీ.. ఆ మరుసటి బంతికి కుశాల్‌ మెండిస్‌ను పెవిలియన్‌ బాట పట్టించాడు.

మెండిస్‌ తాను ఎదుర్కొన్న తొలి బంతికే స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్‌ డక్‌గా ఔటయ్యాడు. ఫలితంగా 46 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన లంక తిరిగి తేరుకోలేకపోయింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ, ఫెర్గ్యుసన్‌ తలో మూడు వికెట్లతో రాణించగా, అతనికి జతగా గ్రాండ్‌ హోమ్‌, జేమ్స్‌ నీషమ్‌, మిచెల్‌ సాంత్నార్‌, బౌల్ట్‌లు తలో వికెట్‌ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement