
ఎంఎస్ ధోని-హర్భజన్ సింగ్(ఫైల్‌ఫొటో)
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోని ఇక టీమిండియాకు ఆడడని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పాడు. మార్చిలో ఐపీఎల్ కోసం చెన్నైలో జట్టుతో పాటు సన్నాహక శిబిరంలో పాల్గొన్న తనకు ఈ విషయం అర్థమైందన్నాడు. ‘నేను క్యాంపులో ఉన్నప్పుడు అందరు అడిగేది ధోని గురించే! అతను భారత్ తరఫున మళ్లీ ఆడతాడా? టి20 ప్రపంచకప్‌కు ఎంపిక అవుతాడా అని అడిగేవారు. నాకీ సంగతులు తెలియవు. దీనిపై అతనే చెబుతాడని నేను దాటేసేవాణ్ని’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు. ఈ జూలైలో 39వ పడిలోకి ప్రవేశించే మహి ఐపీఎల్ ఆడతాడు కానీ టీమిండియాకు ఆడే ఆవకాశమే లేదన్నాడు.(నేరుగా ధోని వద్దకు పో..!)
ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్స్‌లో పాల్గొన్న భజ్జీ.. ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ధోని ఇక టీమిండియాకు ఆడడనే విషయాన్ని చెప్పాడు . రోహిత్ శర్మతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో భజ్జీ పాల్గొన్నాడు. కాగా, ధోని రీఎంట్రీపై రోహిత్ శర్మ మాత్రం అసహనం వ్యక్తం చేశాడు. ధోని రీఎంట్రీపై తనతో ఏమీ చెప్పలేదని రోహిత్ తెలిపాడు. ఒకవేళ ధోని గురించి తెలియాలంటే నేరుగా రాంచీకి వెళ్లి అతన్నే కనుక్కోవాలని సదరు అభిమానికి సూచించాడు.