
ఇంగ్లీష్‌లో మాట్లాడమన్నా!
భారత్, ఆస్ట్రేలియా పోరు అంటే వివాదం లేకుండా సాగదేమో అనిపిస్తోంది. టెస్టు సిరీస్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య అనేక సార్లు వ్యక్తిగత దూషణలు చోటు చేసుకోగా.....
మెల్‌బోర్న్: భారత్, ఆస్ట్రేలియా పోరు అంటే వివాదం లేకుండా సాగదేమో అనిపిస్తోంది. టెస్టు సిరీస్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య అనేక సార్లు వ్యక్తిగత దూషణలు చోటు చేసుకోగా, ఇప్పుడు అది వన్డేల్లోనూ కొనసాగింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ మధ్య జరిగిన ఘటన ఇప్పుడు ముక్కోణపు సిరీస్‌లో వేడి పుట్టించింది. ఇన్నింగ్స్ 23వ ఓవర్లో సింగిల్ తీయబోయిన రోహిత్ శర్మను వార్నర్ రనౌట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే బంతి రోహిత్ కాలికి తగిలి దూరంగా వెళ్లడంతో భారత్ ఓవర్‌త్రో కూడా పూర్తి చేసింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వార్నర్, ఓవర్ ముగిశాక రోహిత్‌తో వాదనకు దిగాడు.
దీనిపై విచారణ జరిపిన ఐసీసీ వార్నర్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. అయితే జరిగిన సంఘటనలో తన తప్పేమీ లేదని, రోహిత్‌ను ఇంగ్లీష్‌లో మాట్లాడమని మాత్రమే తానన్నానని వార్నర్ వివరణ ఇచ్చాడు. ‘నిబంధల ప్రకారం ఆ సమయంలో పరుగు తీయకూడదు. మా ఆటగాళ్లతో వాదన జరుగుతున్న సమయంలో అక్కడికి నేనూ వెళ్లాను.
రోహిత్ హిందీలో ఏదో మాట్లాడాడు. ఇంగ్లీష్‌లో మాట్లాడమని మాత్రమే నేను చెప్పాను. ఎందుకంటే అతను నా గురించి మాట్లాడితే నాకూ అర్థం కావాలి కదా. ఇలా అడగడం తప్పేమీ కాదు. అవసరమైతే మళ్లీ అడిగేవాడిని. నేను అలా అన్నాక రోహిత్ ఇంగ్లీష్‌లో మాట్లాడాడు. అదేంటో నేను చెప్పలేను కానీ నేను జోక్యం చేసుకోకుండా ఉండాల్సింది’ అని వార్నర్ స్పష్టం చేశాడు.
‘ఇది మంచిది కాదు’
అయితే వార్నర్‌కు సొంత బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)నుంచి కూడా మద్దతు లభించలేదు. అతను పదే పదే ఇబ్బందుల్లో పడటం మంచిది కాదని సీఏ సీఈ జేమ్స్ సదర్లాండ్ హెచ్చరించారు. ‘గత ఏడాదిగా అతను చాలా బాగా ఆడుతున్నాడు. కానీ ఇటీవలే రెండు సార్లు ఐసీసీ రిఫరీ ముందు హాజరయ్యాడు. ఇది మంచి పరిణామం కాదు. అలా చేస్తే అతని ఆటపై ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని ఆయన అన్నారు. అయితే వార్నర్‌తో తాను మాట్లాడానని, అతను ఎలాంటి వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయలేదని తాను నమ్ముతున్నట్లు కూడా సదర్లాండ్ చెప్పారు.
హద్దులు దాటవద్దు: లీమన్
తాజా ఘటనకు సంబంధించి ఆసీస్ కోచ్ డారెన్ లీమన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లు తమ పరిధి దాటవద్దని ఆయన అన్నారు. ‘ఐసీసీ ఇలా చర్య తీసుకోవాల్సి రావడం మంచిది కాదు. ఆ ఘటనను నేను సమర్థించను. వార్నర్‌లో దూకుడు ఎక్కువ. అయితే అది హద్దుల్లో ఉంటేనే మంచిది. మేమంతా బాగా ఆడటమే కాదు క్రీడా స్ఫూర్తితో కూడా వ్యవహరించాలి’ అని లీమన్ అభిప్రాయ పడ్డారు.
మరో వైపు ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ కూడా ఈ ఘటనను తప్పు పట్టాడు. 2013లో యాషెస్ సిరీస్‌కు ముందు బార్‌లో రూట్... వార్నర్ చేతిలో దెబ్బలు తిన్న విషయం తెలిసిందే. ‘గత కొన్నాళ్లుగా మైదానంలో చోటు చేసుకుంటున్న ఘటనలు క్రికెట్‌కు చేటు చేస్తాయి. అయితే ఇది మరీ కొట్టుకునే స్థాయికి దిగజారదని నా నమ్మకం. ప్రత్యర్థిని పరస్పరం గౌరవిస్తూనే విజయం కోసం పోరాడవలసి ఉంటుంది. ఈ సందర్భంలో వార్నర్ కెరీర్ గురించి నేను ఆలోచించడం అనవసరం’ అని రూట్ వ్యాఖ్యానించాడు.