2019 వరల్డ్‌ కప్‌ తర్వాతే రిటైర్మెంట్‌

Dale Steyn Says He Will Retire From Limited Overs Cricket After 2019 World Cup - Sakshi

కేప్‌టౌన్‌ : 2019 వరల్డ్‌ కప్‌ తర్వాతే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని దక్షిణాఫ్రికా బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ స్పష్టం చేశాడు. తన అనుభవాన్ని, ప్రదర్శనను దృష్టిలో పెట్టుకోనైనా సరే రానున్న వరల్డ్‌ కప్‌కు ఎంపిక చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఓ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ..‘మా(దక్షిణాఫ్రికా) బ్యాటింగ్‌ లైనప్‌ చూడండి. టాప్‌లో ఉన్న ఆరుగురు ఆటగాళ్లు కలిపి 1000 మ్యాచ్‌లు ఆడారు. కానీ లోయర్‌ ఆర్డర్‌కి వచ్చే సరికి అంతా కలిపి 150 మ్యాచ్‌లు కూడా ఆడలేదు. ప్రతీసారి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే కచ్చితంగా 2019 వరల్డ్‌ కప్‌ స్క్వాడ్‌లో నేనుంటాను. మరో వరల్డ్‌ కప్‌ వచ్చే సరికి నాకు 40 ఏళ్లు నిండుతాయి. అప్పుడు ఎలాగో తప్పుకోవాల్సిందే. అయితే టెస్టు క్రికెట్‌ మాత్రం కొనసాగిస్తానని’  ఈ ప్రొటీస్‌ బౌలర్‌ వ్యాఖ్యానించాడు.

శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ గురించి ప్రస్తావిస్తూ... ‘  ప్రస్తుతం నేను గాయాల బారి నుంచి కోలుకున్నాను. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాను. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లోనూ ఆడాను. నా వరకు మంచి ప్రదర్శనే ఇచ్చానని అనుకుంటున్నాను. కానీ శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌ జట్టులో చోటు సంపాదించుకోలేక పోయాను. అయినా గాయాల నుంచి కోలుకోవడమనేది అంత తేలికైన విషయమేమీ కాదని’  స్టెయిన్ పేర్కొన్నాడు. కాగా ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. గాలేలో జరిగిన మొదటి టెస్టులో రెండు వికెట్లు తీసిన ఈ స్పీడ్‌గన్‌.. రెండో మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top