మూడు వికెట్ల దూరంలో..

Dale Steyn Hopes Shaun Pollock Test Wicket Records - Sakshi

మరో రికార్డుపై కన్నేసిన డేల్‌ స్టెయిన్‌

నేడు ఈ దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ పుట్టినరోజు

ఆల్‌ టైమ్‌ గ్రేటెస్ట్‌ ఫాస్ట్‌ బౌలర్ల జాబితాలో వసీం ఆక్రమ్‌ తర్వాతి స్థానం ఎవరంటే దక్షిణాఫ్రికా స్పీడ్‌గన్‌ డేల్‌ స్టెయిన్‌ అని క్రికెట్‌ పండితులు పేర్కొంటారు. తన ఫాస్ట్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థులను బెంబేలిత్తించిన స్టెయిన్‌ నేడు(జూన్‌ 27న) 35వ ఏట అడుగుపెడుతున్నాడు. 2004లో ఇంగ్లండ్‌పై టెస్ట్‌ అరంగేట్రం చేసిన స్టెయిన్‌ అనతికాలంలోనే జట్టులో, క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. స్టెయిన్‌ 14 సంవత్సరాల క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో రికార్డులు.. మరెన్నో అవార్డులు సాధించాడు. ఈ మధ్య కాలంలో వరుస గాయాలతో జట్టుకు దూరమవుతూ ఇబ్బందులు పడుతున్నా.. తన బౌలింగ్‌ వేగం ఎక్కడా తగ్గటం లేదు. కుర్రాళ్లు ఎంతమంది జట్టులోకి వచ్చి అదరగొట్టినా, స్టెయిన్‌ ప్రత్యేకతే వేరు.

క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఈ స్పీడ్‌గన్‌ మరో మూడు టెస్టు వికెట్లు సాధిస్తే దక్షిణాఫ్రికా తరుపున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకోల్పనున్నాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు(421) సాధించిన రికార్డు ప్రొటీస్‌ దిగ్గజం షాన్‌ పొలాక్‌ పేరిట ఉంది.  ఈ రికార్డును శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌లో స్టెయిన్‌ తిరగరాస్తాడని అభిమానులు ఆశపడుతున్నారు.  

‘నా టార్గెట్‌ 100 టెస్టులు, 500 వికెట్లు , 2019 ప్రపంచకప్‌’  అంటూ శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన అనంతరం డేల్‌ స్టెయిన్‌ పేర్కొన్నాడు. వయసుతో సంబంధం లేకుండా తన లక్ష్యం పూర్తి చేసేవరకు క్రికెట్‌లో కొనసాగుతానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాను సాధించాల్సిన లక్ష్యాలకు గాయాలు అడ్డంకి కాదని, గాయంతో జట్టుకు దూరమైనప్పుడు మరింత ఉత్తేజంతో తిరిగి జట్టులోకి వస్తానని ఈ ప్రొటీస్‌ బౌలర్‌ తెలిపాడు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top