చత్తీస్‌గఢ్ రంజీ జట్టు ఎంపిక వ్యవహారంలో బీసీసీఐతో పాటు ఆ రాష్ట్ర క్రికెట్ సంఘానికి చత్తీస్‌గఢ్ హైకోర్టు నోటీసులు
బిలాస్‌పూర్: చత్తీస్‌గఢ్ రంజీ జట్టు ఎంపిక వ్యవహారంలో బీసీసీఐతో పాటు ఆ రాష్ట్ర క్రికెట్ సంఘానికి చత్తీస్‌గఢ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సీజన్‌లో తొలిసారిగా రంజీ ట్రోఫీలో చత్తీస్‌గఢ్ ప్రాతినిధ్యం వహించనుంది. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికలో తమ ఇష్టానుసారం వ్యవహరించారని ఆరోపిస్తూ మాజీ క్రికెటర్ ఆర్.విజయ్ నాయుడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఇతర రాష్ట్ర క్రికెట్ సంఘాల వెబ్‌సైట్‌లో ఉన్నట్టుగా చత్తీస్‌గఢ్ రాష్ట్ర క్రికెట్ సంఘ్ (సీఎస్‌సీఎస్) వెబ్‌సైట్‌లో సెలక్షన్‌కు సంబంధించిన నియమాలేవీ లేవని తెలిపారు. సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించకుండానే రిషబ్ తివారి, అవినాష్ ధరివాల్, అశుతోష్ సింగ్‌లను జట్టులోకి తీసుకున్నారని ఆయన పిల్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నోటీసులిచ్చిన కోర్టు తదుపరి విచారణను ఈనెల18కి వాయిదా వేసింది.