జాతీయ చాంపియన్‌షిప్‌ వాయిదా

BAI postpones Senior National Badminton Championships - Sakshi

భారత బ్యాడ్మింటన్‌ సంఘం ప్రకటన

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో దేశం మొత్తం లాక్‌డౌన్‌ స్థితిలోకి వెళ్లిన నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రతిష్టాత్మక జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. షెడ్యూల్‌ ప్రకారం లక్నో వేదికగా  ఏప్రిల్‌ 27 నుంచి మే 3 వరకు ఈ టోర్నీ జరగాల్సి ఉండగా, ప్రస్తుత పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు టోర్నీని వాయిదా వేస్తున్నట్లు ‘బాయ్‌’ కార్యదర్శి అజయ్‌ సింఘానియా వెల్లడించారు. ‘ప్రస్తుతం ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడిగించింది.

ఈ నేపథ్యంలో జాతీయ సీనియర్స్‌ టోర్నీతో పాటు ఇంటర్‌ జోనల్‌ చాంపియన్‌షిప్‌నూ వాయిదా వేయాలని నిర్ణయించాం.  ఈ కఠిన పరిస్థితుల్లో కరోనాను సమర్థంగా నియంత్రించడమే అన్నింటికన్నా ప్రధానమైన అంశం. పరిస్థితులు అదుపులోకి వచ్చాక టోర్నీ ఎప్పుడు నిర్వహించాలనేదానిపై చర్చిస్తాం’ అని ఆయన వివరించారు. లక్నో ఏర్పాట్లను విరమించుకోవాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాల క్రీడా సంఘాల కార్యదర్శులకు సూచించామన్నారు. టోక్యో ఒలింపిక్స్‌ను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ వాయిదా వేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘యావత్‌ బ్యాడ్మింటన్‌ వర్గాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. ఆటగాళ్ల ఆరోగ్యమే అందరికీ ప్రధానం’ అని ఆయన అన్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top