ఫెడరర్‌ ఫటాఫట్‌ | Australian Open: Roger Federer's grand-slam glow | Sakshi
Sakshi News home page

ఫెడరర్‌ ఫటాఫట్‌

Jan 27 2018 1:14 AM | Updated on Jan 27 2018 1:14 AM

Australian Open: Roger Federer's grand-slam glow - Sakshi

రోజర్‌ ఫెడరర్‌

అగ్రశ్రేణి ఆటగాళ్లందరూ ఇంటిముఖం పట్టిన వేళ... డిఫెండింగ్‌ చాంపియన్‌ రోజర్‌ ఫెడరర్‌ మాత్రం తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. రికార్డుస్థాయిలో ఏడోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన ఈ స్విట్జర్లాండ్‌ దిగ్గజం ఓవరాల్‌గా 30వసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు.   

మెల్‌బోర్న్‌: కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ సాధించేందుకు స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెడరర్‌ మరో విజయం దూరంలో ఉన్నాడు. కొరియా యువతార హైన్‌ చుంగ్‌తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో సెమీఫైనల్లో రెండో సీడ్‌ ఫెడరర్‌ 6–1, 5–2తో ఆధిక్యంలో ఉన్నదశలో చుంగ్‌ గాయం కారణంగా తప్పుకున్నాడు. దాంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫెడరర్‌ రికార్డుస్థాయిలో ఏడోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 62 నిమిషాలపాటు సాగిన ఆటలో ఫెడరర్‌ తొమ్మిది ఏస్‌లు సంధించి, చుంగ్‌ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేశాడు. ఫైనల్‌ చేరే క్రమంలో ఫెడరర్‌ ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో  ఆరుసార్లు చాంపియన్, మాజీ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించిన చుంగ్‌పై ఫెడరర్‌ పూర్తి ఆధిపత్యం చలాయించాడు.

ఈ కొరియా కుర్రాడికి ఏదశలోనూ పట్టు సంపాదించే అవకాశం ఇవ్వలేదు. ఆదివారం జరిగే ఫైనల్లో ఆరో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)తో ఫెడరర్‌ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్‌ 8–1తో ఆధిక్యంలో ఉన్నాడు. మిక్స్‌డ్‌ ఫైనల్లో బోపన్న జంట  భారత స్టార్‌ రోహన్‌ బోపన్న మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తన భాగస్వామి తిమియా బాబోస్‌ (హంగేరి)తో కలిసి ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్లో బోపన్న–బాబోస్‌ జంట 7–5, 5–7, 10–6తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో డెమోలైనర్‌ (బ్రెజిల్‌)–మరియా (స్పెయిన్‌) జోడీపై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో గాబ్రియేలా దబ్రోవ్‌స్కీ (కెనడా)–మ్యాట్‌ పావిక్‌ (క్రొయేషియా) జంటతో బోపన్న–బాబోస్‌ ద్వయం ఆడుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement