‘పంచ్‌లు’ విసిరిన చేతులు.. ఐస్‌క్రీమ్‌లు అమ్ముతున్నాయి!

Asian Games silver medallist boxer now sells 'kulfi' for a living - Sakshi

భారత బాక్సర్‌ దినేశ్‌ కుమార్‌ దీనావస్థ  

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో రజత పతక విజేత... ‘అర్జున’ అవార్డు గ్రహీత...ఈ ఘనతలేవీ కూడా ఒక అంతర్జాతీయ బాక్సర్‌కు చిరుద్యోగం, ఆర్థిక భద్రతను ఇవ్వలేకపోయాయి. ఫలితంగా అప్పులు తీర్చుకునేందుకు అతను రోడ్డుపై ఐస్‌ క్రీమ్‌లు అమ్ముకోవాల్సిన దీన స్థితి!  30 ఏళ్ల భారత వెటరన్‌ బాక్సర్‌ దినేశ్‌ కుమార్‌ పరిస్థితి ఇది. చాలా మందిలాగే హరియాణాలోని బాక్సింగ్‌ అడ్డా భివాని నుంచి వెలుగులోకి వచ్చిన దినేశ్‌ అంతర్జాతీయ స్థాయిలో 17 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు సాధించాడు.

2010లో చైనాలోని గ్వాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో దినేశ్‌ 81 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. అతని ప్రదర్శనకు గాను అదే ఏడాది రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ చేతుల మీదుగా ‘అర్జున’ పురస్కారం కూడా అందుకున్నాడు. 2014 కామన్వెల్త్‌ క్రీడలకు కొద్ది రోజుల ముందు జరిగిన రోడ్డు ప్రమాదం అతని కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం లేని దినేశ్‌ గత నాలుగేళ్లలో తీవ్రంగా ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నాడు. ‘నన్ను బాక్సర్‌గా తీర్చిదిద్దేందుకే మా నాన్న ఎన్నో అప్పులు చేశారు. అవన్నీ తీరక ముందే నాకు ప్రమాదం జరిగింది.

చికిత్స కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. ఒక అంతర్జాతీయ ఆటగాడిగా నాకు గత ప్రభుత్వంతో పాటు ఇప్పటి ప్రభుత్వం కూడా ఎలాంటి సహాయం చేయలేదు. చిన్నపాటి ఉద్యోగం కూడా లేదు. ఇప్పుడు నాకు రోజు గడవడంతో పాటు అప్పులు తీర్చాలంటే మరో మార్గం లేదు. అందుకే ఇలా తోపుడు బండిపై రోడ్డు మీద కుల్ఫీ (ఐస్‌క్రీమ్‌)లు అమ్మేందుకు సిద్ధమయ్యాను’ అని దినేశ్‌ కుమార్‌ ఆవేదనగా చెప్పాడు. 2018 ఆసియా క్రీడల విజేతలకు భారీ మొత్తంలో నగదు పురస్కారాలు ప్రకటించిన హరియాణా ప్రభుత్వం దినేశ్‌లాంటి గత విజేతను ఇప్పటిౖకైనా ఆదుకుంటుందేమో వేచి చూడాలి.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top