ఉదాసీనత లేకుండా ఆడాలి 

Asia cup :sunil gavaskar match analysis - Sakshi

వరుసగా రెండు మ్యాచ్‌లను చివరి ఓవర్లో చేజార్చుకున్న అఫ్గానిస్తాన్‌ జట్టు ఆటగాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అసలే జోరు మీదున్న భారత్‌తో నేడు జరిగే చివరి సూపర్‌–4 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ పోటీనిస్తుందా లేదా చూడాలి. ఇప్పటికే ఫైనల్‌ అవకాశాలు లేని అఫ్గానిస్తాన్‌ ఈ మ్యాచ్‌లో గెలిచినా ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే తమ పోరాటపటిమతో అభిమానుల మనసులు గెల్చుకునే అవకాశం వారి ముంగిట ఉంది. ఎన్నో అవరోధాలను అధిగమించి అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ ఈస్థాయికి చేరుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల హావభావాలు చూస్తుంటే భావోద్వేగాలు దాచుకోకుండా ఆటను ఆస్వాదిస్తున్నట్లు అనిపిస్తోంది. ఫీల్డింగ్‌లో పొరపాట్లు జరిగినపుడు, క్యాచ్‌లు వదిలేసినపుడు మరీ నిరాశ చెందకుండా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నారు. జట్టుగా ఆడే క్రికెట్‌లో బరిలో ఉన్న పదకొండు మంది ఆటగాళ్లూ ఒకేసారి విజయవంతం కాలేరనే విషయం తెలుసుకోవాలి.

పొరపాట్లకు కుంగిపోకుండా వాటిని సరిదిద్దుకొని మళ్లీ మంచి ప్రదర్శన చేయాలనే దృక్పథం ఉన్న జట్లకు తొందరగానే మంచి ఫలితాలు వస్తాయి. ఒకప్పుడు వెస్టిండీస్‌ దిగ్గజ కెప్టెన్‌ క్లయివ్‌ లాయిడ్‌ తమ జట్టు సభ్యులెవరైనా ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేస్తే మైదానంలో ఎలాంటి భావోద్వేగాలు ప్రదర్శించేవారు కాదు. 90వ దశకంలో ఆస్ట్రేలియా జట్టు కూడా ఇలాగే వ్యవహరించింది. ప్రస్తుతం భారత జట్టు తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా ఇలాగే వ్యవహరిస్తున్నాడు. భారత ఫీల్డర్లు పొరపాట్లు చేసినపుడు రోహిత్‌ ఆగ్రహం వ్యక్తం చేయకుండా, కాస్త నవ్వి భావోద్వేగాలను దాచుకుంటున్నాడు. ఇలాంటి సందర్భాల్లో కెప్టెన్‌ ప్రశాంతంగా ఉంటే పొరపాటు చేసిన ఫీల్డర్‌పై అదనపు ఒత్తిడి ఉండదు. రోహిత్‌ శర్మ–శిఖర్‌ ధావన్‌ ఓపెనింగ్‌ జోడీ జోరు చూస్తుంటే ఐదో నంబర్‌ తర్వాతి బ్యాట్స్‌మెన్‌ ప్యాడ్‌లు కట్టుకొని సిద్ధంగా ఉండాల్సిన అవసరం లేదనిపిస్తోంది. భారత బౌలర్లు కూడా అద్భుతంగా వేస్తున్నారు. ఇప్పటికే ఫైనల్‌ చేరిన భారత్‌ నామమాత్రపు మ్యాచ్‌లో ఉదాసీనతకు చోటివ్వకుండా ఆడుతుందని.. క్లీన్‌స్వీప్‌తో ఆసియా కప్‌ను ముగిస్తుందని ఆశిస్తున్నాను.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top