వారిద్దరూ నమ్మక ద్రోహం చేశారు..

Arthur Defends Remarks About Wasim And Misbah - Sakshi

కేప్‌టౌన్‌: తనను పాకిస్తాన్‌ క్రికెట్ ప్రధాన కోచ్‌ పదవి నుంచి తప్పించడానికి ప్రస్తుత హెడ్‌ కోచ్‌గా ఉన్న మిస్బావుల్‌ హక్‌ కూడా ఒక కారణమంటూ మికీ ఆర్థర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనను తప్పించడంలో మిస్బావుల్‌తోపాటు వసీం అక్రమ్‌ కూడా కీలక పాత్ర పోషించారంటూ ఆర్థర్‌ పేర్కొన్నాడు.. వీరిద్దర్నీ తాను ఎంతగానో నమ్మితే తనకు అన్యాయం చేశారన్నాడు.  ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని ఆర్థర్‌ పేర్కొన్నాడు.వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ వైఫల్యం తర్వాత పీసీబీ ఒక కమిటీని నియమించింది.  దీనిపై సదరు కమిటీ విచారణ చేపట్టిన తర్వాతే మికీ ఆర్థర్‌ కాంట్రాక్ట్‌ను పొడిగించడానికి పీసీబీ మొగ్గు చూపలేదు.

ఇందులో మిస్బావుల్‌ హక్‌తో పాటు వసీం అక్రమ్‌లు సభ్యులుగా ఉండటాన్ని ఆర్థర్‌ ప్రధానంగా ప్రస్తావించాడు. ఈ కమిటీ రిపోర్ట్‌ తనకు వ్యతిరేకంగా ఉండటం వల్లే కోచ్‌ పదవిని కోల్పోవాల్సి వచ్చిందన్నాడు. ఈ క‍్రమంలోనే మిస్బావుల్‌, వకార్‌లను టార్గెట్‌ చేశాడు. ‘ నేను ఎందుకు పదవి కోల్పోయానో ఊహించగలను. అందుకు కారణం నేను నమ్మినవారే. మిస్బావుల్‌, అక్రమ్‌లు కమిటీ సభ్యులిగా ఉన్నప్పటికీ నా కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు. నేను పాకిస్తాన్‌ క్రికెట్‌కు పూర్తిస్థాయిలో సేవలందించాను. దాంతోనే మిస్బావుల్‌-అక్రమ్‌లు నాకు అనుకూలంగా నివేదిక ఇస్తారనుకున్నా. కానీ నాకు వ్యతిరేకంగా ఇచ్చారు. దాంతో నేను కోచ్‌ పదవి నుంచి వైదొగాల్సి వచ్చింది’ అని ఆర్థర్‌ పేర్కొన్నాడు. మరొకవైపు కొత్తగా హెడ్‌ కోచ్‌గా నియమించబడ్డ మిస్బావుల్‌ హక్‌ సక్సెస్‌ కావాలని కోరుతున్నట్లు స్పష్టం చేశాడు. ‘ మిస్బావుల్‌ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాడు. అతనొక ఉన్నతమైన వ్యక్తి.. అందుకోసమే పాకిస్తాన్‌ క్రికెట్‌ ప్రధాన కోచ్‌ బాధ్యతల్ని అప్పజెప్పింది. కానీ నేను ప్రతీ సెకండ్‌ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినా నన్ను తప్పించడం బాధించింది’ అని ఆర్థర్‌ తెలిపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top