
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) కొత్త అధిపతిగా రాజస్తాన్ మాజీ డీజీపీ అజిత్ సింగ్‌ను నియమించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న నీరజ్ కుమార్ స్థానంలో అజిత్ సింగ్ ఈ బాధ్యతలు చేపడతారు. శనివారంతోనే నీరజ్ కుమార్ పదవీకాలం ముగిసింది. అయితే ఐపీఎల్–11 సీజన్ నేపథ్యంలో మే 31 వరకు నీరజ్ కుమార్‌ను ఏసీయూ సలహాదారుగా నియమించారు.
అంతకుముందు అజిత్ సింగ్ నియామకంపై సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ), బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి మధ్య రగడ చెలరేగింది. తన ప్రమేయం లేకుండానే అజిత్ నియామకం జరిగిందని అమితాబ్ చౌదరి విమర్శించారు.