మళ్లీ తమిళనాడుకే | Again Tamilnadu team won the title | Sakshi
Sakshi News home page

మళ్లీ తమిళనాడుకే

Sep 13 2013 1:36 AM | Updated on Sep 1 2017 10:39 PM

ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో గత ఏడాది ఫలితమే పునరావృతం అయింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) జట్టు టైటిల్ నిలబెట్టుకోగా...

 సాక్షి, హైదరాబాద్:  ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో గత ఏడాది ఫలితమే పునరావృతం అయింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) జట్టు టైటిల్ నిలబెట్టుకోగా... ఢిల్లీ (డీడీసీఏ) జట్టుకు మరోసారి ఫైనల్లో నిరాశే ఎదురైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గురువారం ముగిసిన ఫైనల్లో తమిళనాడు 88 పరుగులు తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. మూడు రోజుల పాటు జరగాల్సిన ఫైనల్లో తొలి రెండు రోజుల పాటు వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు. దాంతో చివరి రోజు ఇరు జట్ల మధ్య 50 ఓవర్ల వన్డే మ్యాచ్ జరిగింది.  టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది.
 
 ముందుగా బ్యాటిం గ్‌కు దిగిన తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. బాబా అపరాజిత్ (128 బంతుల్లో 123; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. శ్రీకాంత్ అనిరుధ (102 బంతుల్లో 78; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా, సురేశ్ కుమార్ (31) రాణించాడు. అపరాజిత్, అనిరుధ రెండో వికెట్‌కు 153 పరుగులు జోడించారు. ఢిల్లీ బౌలర్లలో పర్వీందర్ అవానా 46 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ 45.1 ఓవర్లలో 206 పరుగులకే ఆలౌటైంది. పునీత్ బిస్త్ (44), మిలింద్ కుమార్ (40), జాగృత్ ఆనంద్ (33), మోహిత్ శర్మ (32) కొద్దిగా ప్రతిఘటించగలిగారు. తమిళనాడు బౌలర్ రాహిల్ షా 40 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. సురేశ్‌కుమార్‌కు 2 వికెట్లు దక్కాయి. విజేతగా నిలిచి తమిళనాడుకు రూ. 1 లక్ష, రన్నరప్ ఢిల్లీకి రూ.50 వేల ప్రైజ్‌మనీ దక్కింది. ఆర్మీ ఉన్నతాధికారి మేజర్ జనరల్ సీఏ పీఠావాలా (ఏసీ వీఎస్‌ఎం జీఓసీ-ఆంధ్రా సబ్ ఏరియా) ముఖ్య అతిథిగా హాజరై ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శులు జి.వినోద్, ఎంవీ శ్రీధర్‌లతో పాటు పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement