
ప్రముఖ దర్శకుడు శంకర్ తదుపరి చిత్రం గురించి ఊహాగానాలు వినపడుతున్నాయి. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత శంకర్ సముద్రం నేపథ్యంలో ఆక్టోపస్ ప్రధాన పాత్రగా 3డి చిత్రం తీయనున్నారనీ, ఫుల్ యాక్షన్ అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్‌తో రూపొందబోయే ఈ చిత్రానికి స్క్రిప్టు కూడా లాక్ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో సూపర్ పవర్స్ కలిగిన భారీ సైజు ఆక్టోపస్‌ది కీలక పాత్రట. అందుకోసం మొదట బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌ను సంప్రదించగా, ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో షారూఖ్‌ను లైన్లో పెట్టినట్టు సమాచారం.
గత చిత్రం రోబో 2.0లో అక్షయ్‌కుమార్‌ను పక్షిరాజుగా చూపెట్టిన శంకర్ అక్టోపస్ క్యారెక్టర్‌ను దాన్ని మించి ఉండేలా డిజైన్ చేశారంట. ఈ సినిమాలో మరికొన్ని పాత్రల కోసం జాకీచాన్, తమిళ నటుడు విజయ్, చైనీస్ నటి లీ బింగ్ బింగ్‌లను కూడా సంప్రదించారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రోబో 2ను మించిన బడ్జెట్ అవసరమవడంతో ఈ చిత్రం నిర్మాణం కోసం ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థల్ని సంప్రదిస్తున్నాడంట శంకర్. అయితే ఇవన్నీ ఊహాగానాలే. శంకర్ నుంచి గానీ, షారూక్ నుంచి గానీ ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాలేదు. అసలు విషయం ఏంటన్నది తెలుసుకోవాలంటే కొద్ది కాలం ఆగాల్సిందే.