ఈ వీడియో చూసిన తర్వాతైనా..

Video Shows Stark Difference Between Smokers and Non Smokers Lungs - Sakshi

పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎన్నో ప్రకటనల్లో చూస్తుంటాం. పొగ తాగితే మనకే కాదు.. మన చుట్టూ ఉన్నవారికి కూడా ప్రమాదమని తెలిసినా చాలా మంది ఆ వ్యసనాన్ని మానుకోలేకపోతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ప్రకారం.. పొగ తాగడం వల్ల ఏడాదికి సుమారు 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో సుమారు 60 లక్షల మంది ప్రత్యక్షంగా పొగతాగడం వల్ల, మరో 9 లక్షల మంది పొగతాగే వారి పక్కనుండటం వల్ల (సెకండ్ స్మోకర్స్‌గా) మరణిస్తున్నారని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఈ నేపథ్యంలో నార్త్‌ కరోలినాకు చెందిన నర్స్‌ అమాండ ఎల్లర్‌.. తాను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వీడియో చూస్తే పొగరాయుళ్లు ఇక స్మోకింగ్ మానేయడం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పొగ తాగేవారి, తాగనివారి ఊపిరితిత్తుల పనితీరును వివరించే వీడియో పోస్ట్‌ చేసిన అమాండ.. ‘క్యాన్సర్ పేషెంట్, 20 ఏళ్ల పాటు రోజూ ఒక ప్యాకెట్‌ సిగరెట్‌ తాగిన వారి ఊపిరితిత్తులు. ఆరోగ్యకరమైన వ్యక్తి ఊపిరితిత్తులు ఇవి. వీడియో చూశాక కూడా స్మోకింగ్ చేయాలనుకుంటున్నారా?’  అని ఆమె ప్రశ్నించారు. ఆమె చేసిన పోస్ట్‌ 5 లక్షల షేర్లతో దూసుకుపోతోంది. వీడియోలోని నల్లగా మారిన ఆ ఊపిరితిత్తులను చూస్తే.. పొగ తాగడం మానేయాలకున్న వారు.. ఒక్కసారిగా మానేయడం వీలుకాకపోయినా.. క్రమ క్రమంగా మానేయడానికి ప్రయత్నిస్తే ఆమె పోస్ట్‌కి ఫలితం దక్కడంతో పాటు.. మీ ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top